Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస వైద్య సౌకర్యాలు లేక అల్లాడుతున్న జనం
- మీకు చీమకుట్టినట్టయినా లేదు : మోడీ సర్కార్‌కు 187మంది ప్రముఖులు లేఖ
- నైతికంగా, రాజ్యాంగబద్ధంగా బాధ్యతల నుంచి తప్పుకున్న కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభవేళ ప్రజలకు కనీస వైద్య సౌకర్యాలు అందటం లేదని దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, వృత్తి నిపుణులు మోడీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరు చాలా దారుణంగా ఉందని, కేంద్రం తన నైతిక, రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పుకుందని వారు ఆరోపించారు. మోడీ సర్కార్‌కు రాసిన బహిరంగ లేఖలో వారు పై అంశాలు ప్రస్తావించారు. అరుణ్ రారు, రొమిల్లా థాపర్, ప్రభాత్ పట్నాయక్, హర్ష మందిర్, రాజ్‌మోహన్ గాంధీ, విల్సన్ బెజవాడ..మొదలైనవారు లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు కనీస వైద్య సేవలు పొందేందుకు అష్టకష్టాలు పడుతున్నారని, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా, బాధాకరంగా ఉందని వారు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.'' కరోనా రోగులకు సమయానికి వైద్యసాయం అందక రోడ్లమీద మరణిస్తున్నారు. నదుల్లో, నదీ తీర ప్రాంతాల్లోకి శవాలు కొట్టుకువస్తున్నాయి. ఈ ఘటనలు చూసి షాక్‌కు గురయ్యాం. కరోనా సంక్షోభాన్ని భారత ప్రభుత్వం ఎదుర్కొంటుందన్న నమ్మకం బద్దలైంది. అనేక వనరులు ఉపయోగించి వైరస్‌పై పోరాటాన్ని జరుపుతారనుకుంటే అదేమీ జరగలేదు'' అని లేఖలో ప్రముఖులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంతో కలిసి పనిచేయడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎంతోమంది ముందుకు వచ్చారు. అయినా దీనిని కేంద్రం ఉపయోగించుకోలేదు. ఎవరి నుంచీ సలహాలు సూచనలూ తీసుకోవడానికి సుముఖత కనబర్చలేదు. అలాగే రాష్ట్రాలు, నిపుణులు, సామాజిక వేత్తలు, అన్ని రాజకీయ పక్షాలతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేయటంగానీ చేయలేదు. వైరస్ కట్టడి, మరణాల సంఖ్యను తగ్గించటం కోసం కేంద్రం ఎలాంటి చొరవా చూపలేదు...అని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.