Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి ఏచూరి లేఖ
- పాలస్తీనాపై ఓటింగ్‌కు గైర్హాజరుపై సీపీఐ(ఎం) నిరసన
న్యూఢిల్లీ : పాలస్తీనా సమస్యపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(యూఎన్హెచ్ఆర్సీ) చేసిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా నిరసించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని మోడీకి శుక్రవారం ఈ మేరకు ఒక లేఖ రాశారు.పాలస్తీనా సమస్యపైన, ప్రజలందరికి మానవ హక్కులకు సంబంధించిన అంశంపైన ఐరాస మానవహక్కుల మండలిలో తీర్మానం పై ఓటింగ్‌లో భారత్ పాల్గొనకపోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఏచూరి పేర్కొన్నారు. ఆ లేఖలో ఆయన ఇంకా ఇలా పేర్కొన్నారు. 'తమ మాతృభూమిపై పాలస్తీనియన్లకు గల చట్టబద్ధమైన హక్కుకు భారత ప్రజలు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తూనే వచ్చారు. స్వాతంత్య్రం రాక ముందునుంచి మనం ఇదే వైఖరిని భారత్ అనుసరిస్తూ వస్తున్నది. మన స్వాతంత్య్ర పోరాటంలో ఇదొక భాగంగా ఉన్నది. జాతీయ ఏకాభిప్రాయంతో మనం పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నాం. కానీ యూఎన్హెచ్ఆర్సీలో భారత్ ఓటింగ్ ఈ ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘించేదిగా ఉంది. పాలస్తీనాపై ఐక్యరాజ్య సమితి చేసే తీర్మానాలన్నింటినీ భారత్ ఎప్పుడూ సమర్ధిస్తూనే వస్తున్నది. వీటిని ఇజ్రాయిల్ ఉల్లంఘించడాన్ని, పాలస్తీనా భూములను అక్రమంగా ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకించడంలో భారత్ ఛాంపియన్‌గా ఉన్నది. ఐక్యరాజ్య సమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి మే 17న భద్రతా మండలిలో మాట్లాడుతూ, పాలస్తీనా సమస్య న్యాయమైన పరిష్కారానికి భారత్ మద్దతును తెలియజేశారు. తూర్పు జెరూసలేం పాలస్తీనా రాజధానిగా రెండు సమాన సార్వభౌమత్వ దేశాల ఏర్పాటే పరిష్కారమార్గమన్న భారత్ వైఖరిని పునరుద్ఘాటించారు. ఆ తరువాత పది రోజులకే వైఖరి మారిపోయింది. అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలను ఇజ్రాయిల్ గౌరవించాలనీ, వాటికి అనుగుణంగా వ్యవహరించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. భారత్ తీసుకున్న ఈ వైఖరి పట్ల అంతర్జాతీయంగా తీవ్ర అసంతృప్తి, నిరాశ వెల్లడైంది. నిరసనలు వెల్లువెత్తాయి. పాలస్తీనియన్లతో సహా మొత్తంగా ప్రజల మానవ హక్కులను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మానవ హక్కుల మండలి సాగించిన కీలకమైన కృషికి ఇది విఘాతం కలిగించేదిగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. భారత్‌లో మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛ ప్రమాణాలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్న తరుణంలో ఇది చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. భారత్‌లో మానవ హక్కుల ప్రమా ణాలను పరిరక్షించాల్సి వుందని అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న ఆందోళన నుంచి ఈ గైర్హాజరును వేరుచేసి చూడలేం. పాలస్తీనియన్ల ప్రయోజనాలకు భారత్ తన మద్దతును పునరుద్ఘాటించాలి. పాలస్తీనియన్ల పోరాటానికి మద్దతివ్వా లన్న జాతీయ ఏకాభిప్రాయం నుంచి వెనక్కి మళ్లరాదు. ఈ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఏర్పాటు చేసిన స్వతంత్ర విచారణా కమిషన్‌తో సహకరించే అంశంపై తక్షణమే దృష్టి సారించాల్సి ందిగా మిమ్మల్ని కోరుతున్నాను.'' అని ఏచూరి తన లేఖలో పేర్కొన్నారు.