Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి నిధుల కేటాయింపులతో ముడిపెడతారా
- కేంద్ర మంత్రి తోమర్‌కు బృందాకరత్ లేఖ
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద ఎస్సీ, ఎస్టీ, ఇతరులు కేటగిరీ ప్రకారం వేతనాలు చెల్లించడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన అడ్వైజరీ నోట్ ఉద్దేశాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె మంత్రి నరేందర్ సింగ్ తోమర్‌కు లేఖ రాశారు. చట్టాన్ని అమలు చేయడంలో ప్రతి కోణంలోనూ సామాజిక వర్గీకరణకు హామీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అడ్వైజరీ నోట్ కోరుతోంది. కానీ, దీనికి గల కారణమేంటనేది తెలియడం లేదని పేర్కొన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సరైన కారణం చెప్పలేదనీ, పైగా నిధులు సకాలంలో విడుదల కావాలంటే నిర్దిష్ట కాలపరిమితిలో అన్ని పక్షాలు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొనడం చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలు తలెత్తుతున్నాయని బృందాకరత్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకమనేది సార్వజనీన కార్యక్రమం, పైగా మొత్తంగా చట్టం అమలుకు బడ్జెట్ నిబంధనలను రూపొందించారు. అటువంటప్పుడు సామాజిక వర్గీకరణల ద్వారా వివిధ కేటాయింపులు జరిపే విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదనీ, చట్టానికి కొత్త భాష్యం చెప్పాల్సిన పని అంతకంటే లేదని తెలిపారు. డిమాండ్‌ను బట్టి పని ఉండే ఈ సార్వజనీన కార్యక్రమంలో పని, కేటాయింపులు అన్నీ కూడా దానికి తగ్టట్లే వుంటాయి. కేటాయింపులను ఇలా వర్గాలతో ముడిపెట్టడం వల్ల మొత్తంగా చట్టం ప్రాతిపదికే దెబ్బతింటుంది. అందువల్ల ఎందుకు ఈ వర్గీకరణ తీసుకొచ్చారో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం వుందని బృందా కరత్ ఆ లేఖలో కోరారు. పైగా బహిరంగంగా దీనిపై ఎలాంటి చర్చ జరపకుండా అమలు చేస్తున్నారని విమర్శించారు. నిధుల కేటాయింపులతో ఈ అడ్వైజరీ నోట్‌ను ముడిపెట్టినందున ఇది చాలా కీలకంగా మారింది. కానీ ఇప్పటివరకు ఈ అడ్వజరీ నోట్ కనీసం మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా కనిపించడం లేదన్నారు. పార్లమెంట్లో చర్చించలేదు, కనీసం గ్రామీణాభివృద్ధిపై స్థాయీ సంఘం సమావేశంలో కూడా పెట్టలేదని తెలిపారు. ఇటువంటి చర్చలేమీ జరపకుండా దీన్ని అమలు చేయరాదని ఆమె స్పష్టం చేశారు. సార్వజనీక కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలు, మహిళల హక్కుల పరిరక్షణకు సీపీఐ(ఎం) ఎప్పుడూ మద్దతుగానే వుంటుందని, ప్రభుత్వం దగ్గరే వారికి సంబంధించిన వివరాలు, గణాంకాలు లేవని పేర్కొన్నారు. 'ఏడాదిలో ఎన్ని ఎస్టీ కుటుంబాలకు 150 రోజులు పని కల్పించారో వివరాలు వున్నాయా? అటువంటి రికార్డులేవీ పబ్లిక్ డొమైన్లో లేవు.
అటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి బదులుగా, ఇటువంటి అడ్వైజరీ పంపించడం ప్రశ్నార్ధకంగా మారింది. దీని వెనుకగల ఉద్దేశాలు, భావనలు తెలియాల్సిన అవసరముంది. అసలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులే వుండడం లేదన్నది ఇక్కడ ప్రధాన సమస్యగా వుంది. ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో సగటు పని దినాలు కేవలం 20గా వున్నాయి. గతేడాది కన్నా కూడా ఇది తక్కువగా వుంది. అది కూడా కరోనాతో ఉపాధి అవకాశాలు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో పరిస్థితి ఇలా వుంది. కనుక గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తగినన్ని పనిదినాలు కల్పించేలా చూసి ఆకలిదప్పులను నివారించేందుకు చర్యలు తీసుకోవడం ముఖ్యమని ఆమె సూచించారు.