Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ, మహారాష్ట్రలలో అన్‌లాక్ ప్రారంభం
న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కరోనా మరణాలు మళ్లీ పెరిగాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 1.20 లక్షల మందికి కరోనా సోకగా.. 3,380 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 20,84,421 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,20,529 మందికి వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879 చేరింది. ముందు రెండు రోజులు మూడు వేలకు దిగువనే మరణాలు సంభవించి నప్పటికీ.. తాజాగా పెరుగుదల కనిపించింది. ఇప్పటివరకు 3,44,082 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాలు రేటు 1.19 శాతంగా కొనసాగుతోంది.
తమిళనాడులో లాక్డౌన్ పొడిగింపు
తమిళనాడులో ఈనెల 14 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం పెద్దగా లేని 11 జిల్లాల్లో ఈ నెల 7 నుంచి కొద్దిగా సడలింపులు ఇచ్చింది. కర్ణాటకలో కరోనా మరణాల రేటు పెరిగింది. 8 వారాల్లో కోవిడ్ మరణాల రేటు 0.48 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.
సరి-బేసి పద్ధతిలో మార్కెట్లు, మాల్స్ : కేజ్రీవాల్
ఢిల్లీలో లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరిచేందుకు అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఐదు దశల అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మినహాయింపులు సోమవారం నుండి అమల్లోకి వస్తాయని ఉద్ధవ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల లభ్యత ఆధారంగా ఈ ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు తెలిపింది.