Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్టూనిస్టుకు ట్విట్టర్ చేత నోటీసులు ఇప్పించిన మోడీ సర్కార్
- కరోనాపై పోరులో వైఫల్యాన్ని ఎత్తిచూపిన మంజుల్
- మధ్యప్రదేశ్‌లో ఆరుగురు జర్నలిస్టులపై కేసులు
భోపాల్: కోవిడ్-19 నిర్వహణలో వైఫల్యం లేదా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించినా, లోపాలను ఎత్తిచూపినా సహించలేని స్థితిలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఉంది. కరోనా మొదటి దశలో దేశవ్యాప్త లాక్డౌన్, తక్కువ కోవిడ్ పరీక్షలు, వలస కార్మికుల వెతలకు సంబంధించి సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో బిజెపి నేత ఫిర్యాదు ఆధారంగా ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసును తాజాగా విచారించిన సుప్రీంకోర్టు ఆ కేసు కొట్టేసింది. ఇదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసినా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా కోవిడ్ రెండో దశ కట్టడిలో ప్రభుత్వ లోపాలను కార్టూన్ల రూపంలో ఎత్తిచూపిన పొలిటికల్ కార్టూనిస్టు మంజుల్‌కు కేంద్రప్రభుత్వం ట్విట్టర్ చేత నోటీసులు ఇప్పించింది. మంజుల్ సోషల్ మీడియా ప్రొఫైల్ భారత చట్టాలను ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుంచి ట్విట్టర్‌కు ఒక అభ్యర్థన వచ్చింది. దీనిపై సమాచారం ఇస్తూ ట్విట్టర్ నుంచి తనకు ఈమెయిల్ రూపంలో నోటీసులు వచ్చాయని మంజుల్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మంజుల్ దేశంలోని పలు వార్తాపత్రికలకు కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. రిపోర్టెడ్ కంటెంట్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ట్విట్టర్ ఈమెయిల్లో తెలిపింది. ప్రభుత్వ అభ్యర్థనను సవాలు చేయాలనుకున్నా, పౌర సంస్థలను సంప్రదించాలనుకుంటే చట్టపరమైన సమాచారం తీసుకోవచ్చని తెలిపింది. లేదా స్వచ్ఛందంగా కంటెంట్‌ను తొలగించొచ్చని పేర్కొంది. ట్విట్టర్‌కు అభ్యర్థనలో మంజుల్ చేసిన నిర్దిష్ట ట్వీట్‌ను కానీ, కార్టూన్ కానీ ప్రభుత్వం ప్రస్తావించకపోవడం గమనార్హం. మంజుల్ ప్రొఫైల్‌పైనే ఫిర్యాదు చేసింది.
దేశంలో ఆక్సిజన్ కోసం కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులు, చనిపోయిన వారికి అంత్యక్రియలు జరుగుతున్న తీరు, నదుల్లో వందలాది మృతదేహాలు కొట్టుకొచ్చిన ఘటనలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఘాటుగా విమర్శిస్తూ కార్టూన్లు వేశారు. ఇది కంటగింపుగా మారిన కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ నుంచి నోటీసులు ఇప్పించింది. తనకు నోటీసులు రావడంపై మంజుల్ స్పందిస్తూ.. 'మోడీ ప్రభుత్వాన్ని అభినందించండి' అని ఎద్దేవా చేస్తూ మరో పోస్టు చేశారు. మంజుల్‌కు ఇతర కార్టూనిస్టులు, వందలాదిమంది తన అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా మద్దతు లభిస్తోంది. కేంద్రం తీరును వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో 2 నెలల్లో ఆరుగురు జర్నలిస్టులపై కేసులు..
కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లోనే పలు బిజెపి పాలిత రాష్ట్రాలు నడుస్తున్నాయి. కోవిడ్-19 కట్టడిలో స్థానిక అధికార యంత్రాంగం లోపాలను ఎత్తిచూపడంతోపాటు మంత్రులను విమర్శిస్తూ కథనాలు రాయడంతో మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం గత రెండు నెలల కాలంలో ఆరుగురు జర్నలిస్టులపై కేసులు పెట్టింది. కంద్వా జిల్లాలో ఆక్సిజన్, బెడ్ల కొరతకు సంబంధించి ప్రచురించిన కథనం ఫేక్ అని, తప్పుదారి పట్టించేవిధంగా ఉందని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ అనరు ద్వివేది హిందీ డైలీ దైనిక్ భాస్కర్ ఎడిటర్‌కు ఏప్రిల్ 19న నోటీసులు ఇచ్చారు. 29న, ఒక టివిషోలో బిజెపి మంత్రి పనితీరును విమర్శినందుకు ఇండోర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అరవింద్ తివారీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా నెట్వర్క్18కి చెందిన జర్నలిస్టు సమీర్ ద్వివేదిపై కేసు పెట్టారు. మే నెలలో కోవిడ్ నిర్వహణలో జిల్లాల అధికారుల వైఫల్యాన్ని రిపోర్టు చేసినందుకు రాజ్‌ఘర్‌కు చెందిన జర్నలిస్టు తన్వీర్ వర్సి, చత్తార్పూర్కు చెందిన చౌరాసియా, షాదోల్కు చెందిన మఫూజ్ ఖాన్, శ్రీవాస్తవలపై కేసులు నమోదు చేశారు.