Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపూర్ణ క్రాంతి దివస్ విజయవంతం
- దేశ వ్యాప్తంగా మూడు నల్ల చట్టాల కాపీలు దహనం
- వేలాది ప్రాంతాల్లో నిరసనలు
- హర్యానాలో రైతులపై లాఠీచార్జ్
- ప్రతిఘటన తీవ్రతరానికి ఒక హెచ్చరిక : ఎస్కేఎం నేతలు
రైతులు కన్నెర్రజేశారు. మూడు నల్ల చట్టాలకు సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా శనివారం సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన సంపూర్ణ క్రాంతి దివస్ విజయవంతమైంది. ఎస్కేఎం పిలుపుకు ప్రతి స్పందనగా వేలాది ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దేశవ్యాప్తంగా మూడు నల్ల చట్టాల కాపీలను దహనం చేశారు. దేశం అంతటా బీజేపీ నాయకుల ఇండ్ల ముందు, కార్యాలయాల ఎదుట, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపురతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. బీజేపీ నాయకుల ఇండ్లు, కార్యాలయాలు ఘెరావ్ చేశారు. ఇది ఢిల్లీ ప్రక్కనే ఉన్న రాష్ట్రాల్లోనే కాదు, కర్నాటక ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది. అనేక ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు జరిగాయి. కలెక్టర్లు, ఇతర అధికారులకు మెమోరాండం సమర్పించారు. కొన్ని చోట్ల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. కొన్ని చోట్ల చట్టాల కాపీలు దహనం చేయ డానికి ముందు మాక్ అంత్యక్రియలు చేసేందుకు శవయాత్రలు నిర్వహించారు. గురుగ్రాంలో 40కి పైగా రైతు సంఘాలతో కూడిన ఎస్కేఎం బీజేపీ ఎమ్మెల్యేల కార్యా లయాల ముందు ప్రధాన రహదారిని అడ్డుకుని నిరసన వ్యక్తంచేసింది. నల్లచట్టాల కాపీలను రైతులుదహనం చేశా రు. పోలీసుల బలగాలను ఉంచినా రైతులు లెక్కచేయలేదు.
హర్యానాలో రైతులపై లాఠీచార్జ్ హర్యానాలోని పంచకులాలో జిరాక్పూర్-కల్కా రహదారిని నిరసనకారులు అడ్డుకోవడంతో రైతులను పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మూడు వ్యవసాయ చట్టాల కాపీలను దహనం చేయడానికి రైతులు హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా నివాసం వైపు వెళ్లారు. రైతులు ముందుగా ప్రకటించిన ఘెరావ్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, పోలీసులు మాజ్రీ చౌక్ వద్ద రైతులపై లాఠీచార్జ్ ప్రయోగించారు. ఈ సంఘటనలో అనేక మంది రైతులు గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే రైతులపై హర్యానా ప్రభుత్వం కొనసాగిస్తున్న క్రూరత్వాన్ని ఎస్కేఎం ఖండించింది. హిసార్‌లో హర్యానా డిప్యూటీ సీఎం నివాసం వద్ద వందలాది మంది పోలీసు సిబ్బందిని మోహ రించారు. అయినా వేలాది మంది రైతులు సమావేశమై, చ ట్టాల కాపీలు తగులబెట్టారు. రైతుల ప్రతిఘటనకు భయపడిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, నిరసన కారులను నివారించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కర్నల్ పర్యటనను ఒకటిన్నర గంటల్లో పూర్తి చేశారు. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
రైతుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ర్యాలీ
హర్యానాలో జేజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర బాబ్లీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకు రైతులను అక్రమ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది రైతులు హిస్సార్ నుంచి తోహానాకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫతేహాబాద్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్‌ను రైతులు చుట్టుముట్టారు. దాదాపు వేలాది మంది రైతులతో జరిగిన ఈ ప్రదర్శనలో ఎస్‌కెఎం నేతలు రాకేశ్ టికాయిత్, యోగేంద్ర యాదవ్, గుర్నామ్ సింగ్ చాధుని పాల్గొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని, రైతులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులపై అమానుషం ప్రదర్శించిన ఎన్డీఎ పాలక జేజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర బాబ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ ప్రభుత్వం దిగివచ్చింది. రైతులపై పెట్టిన కేసులను రద్దు చేసేందుకు, అక్రమంగా అరెస్టు చేసిన రైతులను విడుదల చేసేందుకు, రైతుల పట్ల అమా నుషంగా వ్యవహరించిన ఎమ్మెల్యే దేవేంద్ర బాబ్లీ రైతులకు క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించారు. ఇది మరో రైతు విజయమని ఎఐకెఎస్ నేత కృష్ణ ప్రసాద్ అన్నారు.
పంజాబ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు
పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని ఫాప్రే భైకే గ్రామానికి షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్పర్సన్ విజరు సం ప్లా సందర్శనపై వందలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద రైతులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంలో దళితులు, ఇతరుల మధ్య విభజ నను సృష్టించే ప్రయత్నాన్ని ఎస్‌కెఎం ఖండించింది. నిరసన తెలిపిన రైతులు మరణించిన దళిత యువతకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా కాకుండా బీజేపీ నాయకుడికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంది. బీజేపీ నాయకుల సామా జిక బహిష్కరణను అమలు చేయాలన్న తమ ప్రణాళికలను రైతు సంఘాలు ఇప్పటికే నెలల క్రితం ప్రకటించాయి. 200 మందికిపైగా నిరసనకారులపై వేసినఅన్యాయమైన కేసుల న్నింటినీ వెంటనేతొలగించాలని ఎస్కేఎండిమాండ్ చేసింది.
ప్రతిఘటన తీవ్రతరానికి ఒక హెచ్చరిక : ఎస్కేఎం నేతలు
ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్, అభిమన్యు కోహార్ మాట్లాడుతూ 1974లో ఇదే రోజున ఫాసిస్ట్, అధికార, దోపిడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రక ప్రజా ఉద్యమాన్ని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించారని, 2020 జూన్ 5న కరోనా పేరుతో మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్‌గా తీసుకువచ్చిందని అన్నారు. ఇవి రైతులు ఎప్పుడూ డిమాండ్ చేయని చట్టాలని, అయితే వీటిని రైతుల పేరిట అప్రజాస్వామికంగా తీసుకువచ్చారని విమర్శించారు. ఈ నిరసనలు రాబోయే రోజుల్లో ప్రతిఘటన తీవ్రతరం అవుతాయని చెప్పడానికి ఒక హెచ్చరిక అని స్పష్టం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో మహిళ సమితులు
ఎస్కేఎం నిర్ణయం మేరకు ఆందోళనలు జరుగుతున్న అన్ని సరిహద్దుల్లో మహిళా సమితులు ఏర్పడ్డాయి. సభ్యుల పేర్లు రైతులందరికీ తెలిపారు. ఈ కమిటీలు అన్ని ఏర్పాట్లను చురుకుగా సులభతరం చేస్తాయి. పోరాటంలో పాల్గొనే మహిళా రైతుల సంరక్షణ కోసం పని చేస్తాయి.
191వ రోజు కొనసాగిన రైతు ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్య మం శనివారం నాటికి 191వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగ స్వామ్యం అవుతున్నారు. సింఘూ సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో ఎఐకేఎస్ నేతలు సతనమ్ సింగ్, విజూ క్రిష్టన్, కృష్ట ప్రసాద్ పాల్గొన్నారు. హర్యానా, పంజాబ్ నుంచి ఢిల్లీ సరిహద్దులకు వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు.