Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోరఖ్‌నాథ్ ఆలయం పరిసరాల్లోని ముస్లిం ఇండ్ల స్వాధీనం..
- జర్నలిస్టులకు సైతం బెదిరింపులు.. ఆందోళనలో ముస్లిం కుటుంబాలు
లక్నో: ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి సమీపంలోని (చుట్టుపక్కల ప్రాంతాలు) నివసిస్తున్న ముస్లిం కుటుంబాలపై ప్రభుత్వ ఒత్తిడి పెరుగుతోంది. ఆలయానికి రక్షణ మరింతగా పెంచడానికి భద్రతా ప్రణాళిక రూపొందించింది. దీనిలో భాగంగా ఆ ఆలయం చుట్టూ ఉన్న ముస్లింల ఇండ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ నివాసముంటున్న ముస్లింలను బలవంతంగా ప్రభుత్వం వారిపై ఒత్తిడి పెంచి వారి ఇండ్లను ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నట్టు పత్రాలపై సంతకం చేయించుకుంటున్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చర్యల కారణంగా ఏండ్ల తరబడి నివాసముంటున్న తాము ఇండ్లు వదులుకోవడంతో పాటు తమ జీవనోపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలోనే సమ్మతి పత్రాలపై సంతకం చేశామనీ, అలాగే, దీనికి గల పూర్తి వివరాలు సైతం అధికారులు తెలుపలేదని బాధితులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జిల్లా యంత్రాంగం స్పందిస్తూ... ఆలయ భద్రతా ప్రణాళిక ఇంకా ప్రారంభ దశలోనే ఉందనీ, ఎవరినీ బలవంతం చేయడం లేదని పేర్కొంది. అన్ని కుటుంబాలు తమ ఇష్టపూర్వకంగానే ఒప్పందంపై సంతకం చేశాయని పేర్కొంది, అయితే, ఈ ఒప్పందంపై సంతకం చేసిన కుటుంబాలు ప్రస్తుతం భయాందోళనను వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వారు స్పందించడానికి భయపడుతున్నారు. అక్కడి మూడు బాధిత కుటుంబాలు దివైర్తో మాట్లాడుతూ.. లేఖ్పాల్, జిల్లా యంత్రాంగానికి చెందిన పలువురు అధికారులు తమ ఇంటికి వచ్చి.. గృహాన్ని కొలిచిన తర్వాత ఇంటి స్వాధీనం గురించి చెప్పి.. అవగాహన ఒప్పంద పత్రంపై సంతకం చేయించుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన సమ్మతి తెలిపే పత్రాలు మే28న సోషల్ మీడియాలో వెలుగుచూసి.. వైరల్‌గా మారాయి. ఆ పత్రాల్లో వారి గృహాలను స్వాధీనం చేసుకునేందు సమ్మతి తెలుపుతున్న వారి పేర్లు, సంతకాలు ఉన్నాయి. వీరిలో పలువురి మొబైల్ నెంబర్లు, సంతకాలు లేవు. అలాగే, ప్రభుత్వ అధికార ముద్రలు, సంతకాలు సైతం లేకుండా ఉన్నాయి.
ఈ సమ్మతి పత్రాలు వైరల్ అయిన తర్వాత పలు జాతీయం న్యూస్ ఏజెన్సీలు జిల్లా మేజిస్ట్రేట్ విజయేంద్ర పాండియన్ నుంచి స్పందనలు కోరడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ఇండియా టుమారో డాట్ ఇన్‌లో ఈ అంశాన్ని నివేదించిన మాసిహుజామా అన్సారీ.. మేజిస్ట్రేట్ స్పందనలు కోరగా.. అన్సారీపై ఎన్ఎస్ఏను అమలు చేస్తామని బెదిరిం చాడు. ఈ విషయంపై అన్సారీ మాట్లాడుతూ.. ''గోరఖ్‌నాథ్ ఆలయాన్ని అనుకుని ఉన్న ముస్లిం కుటుంబాలకు వారి ఇండ్లను ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం గురించి నేను డీఎంతో మాట్లాడటానికి ప్రయత్నించినపుడు ఎన్ఎస్ఏ కింద ఆరోపణల బెదిరింపులకు గురయ్యాను. దీనిపై ఎన్హెచ్ఆర్సీకి సైతం ఫిర్యాదు చేశాను'' అంటూ అన్సారీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షహనావాజ్ ఆలం జూన్ 3న జర్నలిస్టు, డీఎంల మధ్య జరిగిన సంభాషణ ఆడియోను విడుదల చేస్తూ.. ''గోరఖ్‌నాథ్ మఠం అనుకుని 125 ఏండ్లుగా అక్కడ స్థిరపడిన ముస్లిం కుటుంబాలను ఖాళీ చేయాలంటూ పారిపాలన యంత్రాంగం బలవంతంగా సంతకం చేయించింది. దీనిపై అనేక వార్త సంస్థల నివేదికలు కూడా ఉన్నాయి. ప్రజలకు న్యాయం చేయాల్సిన డీఎం.. బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకుంటూ.. జర్నలిస్టులపై ఎన్ఎస్ఏ మోపుతామని బెదిరిస్తున్నారు. డీఎంను వెంటనే సస్పెండ్ చేయాలి. దీనిపై పూర్తిగా విచారణ జరిపించాలి'' అంటూ పేర్కొన్నారు.