Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా పోరులో అహర్నిశలు శ్రమిస్తున్న కేరళ నర్సులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం లభిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని గోవింద్ వల్లబ్ పంత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐపీఎంఈఆర్) యాజమాన్యం అక్కడి కేరళ నర్సింగ్ సిబ్బందిని ఉద్దేశించి ఇంగ్లీష్, హిందీలోనే మాట్లాడాలనీ..మలయాళంలో అసలు మాట్లాడొద్దంటూ ఫర్మానా జారీ చేసింది. వీటిని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని బెదిరించింది. దీనికి వ్యతిరేకంగా నర్సులు ఆందోళనకు దిగడం, దేశమంతటా ఇదొక చర్చనీయాంశంగా మారడంతో ఆ సంస్థ మెడికల్ డైరెక్టర్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ ఆదేశాలు ఢిల్లీ ప్రభుత్వం నుంచి కానీ, ఆస్పత్రి పరిపాలన విభాగం నుంచి కానీ రాలేదనీ, ఎవరిచ్చారో తెలియదని అన్నారు. అయినప్పటికీ ఆ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంటున్నామని అన్నారు. జీఐపీఎంఈఆర్లో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందిలో 60 శాతం మంది వరకు కేరళీయులే. రోగులు, సహచర ఉద్యోగులతో మలయాళంలో మాట్లాడుతున్నారని ఫిర్యాదు రావడంతో నర్సింగ్ సూపరింటెండెంట్ నుంచి ఆ ఆదేశాలు జారీ అయ్యాయని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.
క్షమాపణ చెప్పాల్సిందే మలయాళీ నర్సుల యూనియన్
మలయాళంలో మాట్లాడకూడదని ఆదేశాలు జారీచేసి తమ భాషా స్వేచ్ఛను, రాష్ట్రాన్ని అవమానపరిచిన వారు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని మలయాళీ నర్సుల యూనియన్ ప్రతినిధి ఫమీర్ సికె డిమాండ్ చేశారు. పాలనా యంత్రాంగానికి సమాచారం లేకుండా ఆదేశాలు జారీ చేయడాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించాలని అన్నారు. ఎయిమ్స్, ఇతర ఆస్పత్రుల్లోని కేరళ నర్సింగ్ ఆఫీసర్ల ప్రతినిధులు యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.