Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుస్థిర అభివృద్ధికి సంబంధించి పదిహేడు లక్ష్యాల సాధనలో భారత్ ర్యాంకు 115కి పడిపోయింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే రెండు స్థానాలు దిగజారినట్లు 'స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్టు- 2021' తెలిపింది. దక్షిణాసియా దేశాలైన భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ మనదేశం కన్నా మెరుగైన స్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. మొత్తం వందశాతం ఎస్డిజి స్కోరులో భారత్ వాటా 61.9 శాతంగా ఉంది.
పేదరికాన్ని నిర్మూలించడం (ఎస్డీజీ - 1), పేదలందరికీ ఆహారం అందేలా చూడడం, ఆహార భద్రతను కల్పించి, ఆకలితో బాధపడే వారి సంఖ్యను జీరో స్థాయికి తీసుకురావడం (ఎస్డీజీ - రెండు), మంచి ఆరోగ్యం, శ్రేయస్సు (ఎస్డీజీ - మూడు), నాణ్యమైన విద్య (ఎస్డిజి - నాలుగు), లింగ సమానత్వం (ఎస్డీజీ - ఐదు), స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం (ఎస్డీజీ - ఆరు), స్వచ్ఛమైన శక్తి (ఎస్డీజీ - ఏడు), మంచి పని, ఆర్థిక వృద్ధి (ఎస్డీజీ - ఎనిమిది), సమగ్ర, స్థిరమైన పారిశ్రామికీకరణను సాధించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం (ఎస్డీజీ - తొమ్మిది), అసమానతలు తగ్గించడం (ఎస్డీజీ - 10), స్థిరమైన నగరాలు, సమూహాలు (ఎస్డీజీ - 11),, బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి (ఎస్డీజీ - 12), క్లైమేట్ యాక్షన్ (ఎస్డీజీ - 13), మానవ అవసరాలకు తగినంత నీటి వినియోగం (ఎస్డీజీ - 14), భూమిపై జీవితం (ఎస్డీజీ - 15), శాంతి, న్యాయం, బలమైన సంస్థలు (ఎస్డీజీ - 16), పై లక్ష్య సాధన కోసం ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం (ఎస్డీజీ - 17) వంటి సవాళ్లు దేశం ముందు ఇంకా అలాగే ఉన్నట్లు నివేదిక తెలిపింది. మొత్తం 180 దేశాల్లో పర్యావరణ పరిరక్షణ సూచి (ఈపీఐ)లో భారత్ 168వ స్థానంలో ఉంది. వాతావరణం, వాయు కాలుష్యం, పారిశుధ్యం, తాగునీరు, జీవవైవిధ్యం వంటి అంశాల ఆధారంగా ఇపిఐని లెక్కిస్తారు.
రాష్ట్రాల వారీగా సుస్థిరతను అంచనావేస్తే.. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు 2030 నాటికి కూడా ఈ లక్ష్యాలను చేరుకునేలా లేవని నివేదిక పేర్కొంది. జార్ఖండ్ ఐదు లక్ష్యాలలో వెనుకపడగా, బీహార్ ఏడు లక్ష్యాలలో వెనుకబడినట్టు వివరించింది. కేరళ, హిమాచల్ ప్రదేశ్, చంఢగీఢ్ ఎస్డీజీ లను సాధించడంలో మెరుగ్గా ఉన్నట్టు నివేదిక తెలిపింది. భవిష్యత్తు తరాలకు శాంతి శ్రేయస్సు అందించంతో మెరుగైన సమాజాన్ని అందించడం లక్ష్యంగా 2015లో 193 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను ప్రధాన ఎజెండాలో భాగంగా స్వీకరించిన సంగతి తెలిసిందే.