Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్డౌన్, అకాల వర్షాలతో ఆగమాగం
- మొక్కజొన్న రైతులకు కష్టకాలం
పాట్నా : బీహార్‌లో అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. మహమ్మారి కష్టకాల సమయంలో లాక్డౌన్ పరిస్థితులు వారిని దిక్కుతోచని స్థితిలోకి నెట్టాయి. దీనికి తోడు ప్రకృతి ప్రకోపం కూడా వారికి శాపంగా మారింది. అకాల వర్షాలు రైతుల పంటలను నీటిపాలు చేశాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందకుండా పోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నారు.
ధ్రువ్ యాదవ్ అనే రైతు మొక్కజొన్న పంటను వేశాడు. అయితే, యాస్ తుఫాను ప్రభావంతో గతనెల రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు ఆయన పంటను నాశనం చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్డౌన్ పరిస్థితులతో ఆర్థికంగా చితికిపోయి బాధలను అనుభవిస్తున్న ఆయనకు అకాల వర్షాలు కష్టాల ఊబిలోకి నెట్టాయి. ''మొక్కజొన్న పంటపై భారీగా పెట్టుబడి పెట్టాను. కూలీలకు ఖర్చు చేశాను. పంటపై ఎంతగానో ఆశపెట్టుకున్నాను. లాభం వస్తుందని ఆశించాను. అయితే, లాక్డౌన్ పరిస్థితులు, అకాల వర్షాలు నా ఆశలను నాశనం చేశాయి'' అని ధ్రువ్ యాదవ్ వాపోయారు. పూర్నియా జిల్లాకు చెందిన ఈయన తన ఐదు ఎకరాల్లో పంటను వేసి నష్టపోయాడు. ధ్రువ్ యాదవ్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులదీ ఇదే పరిస్థితి.
అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతానికి చెందిన పూర్నియా, కిషన్‌గంజ్, అరారియా, కథియార్ జిల్లాల్లో రైతన్నలకు మొక్కజొన్న ప్రధాన పంట. కానీ, ప్రస్తుత పరిస్థితులతో ఈ జిల్లాల్లోని రైతన్నలు నిండా మునగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు కోషీ ప్రాంతానికి చెందిన మాధేపుర, సహర్స, సుపౌల్, ఖగారియా జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా భాగల్పూర్, సమస్తిపూర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్ని పంటను పండిస్తారు. అయితే, పంటలు దెబ్బతినడంతో నష్టం కోట్లల్లో ఉంటుందని అధికారుల అంచనా.
రాష్ట్ర వ్యవసాయ విభాగం అధికారిక లెక్కల ప్రకారం.. ఒక్క సీమాంచల్, కోషీ ప్రాంతాల్లోనే 65 శాతం మొక్కజొన్న ఉత్పత్తి జరుగుతుంది. సీమాంచల్‌లో 1.40 లక్షల హెక్టార్లు, కోషీ లో 90 వేల హెక్టార్లలో మొక్కజొన్నను రైతులు వేశారు. దేశంలోనే బీహార్ మొక్కజొన్న ఉత్పత్తిలో మూడోస్థానంలో ఉన్నది. అయితే, తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.