Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో అన్నదాతల ఆందోళన
- తొహానా పోలీస్ స్టేషన్ వద్దకు కదిలిన కర్షకులు
న్యూఢిల్లీ .అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాల్సిం దేనంటూ.. తొహానా పోలీస్ స్టేషన్ ముందు రైతుల ఆందోళనకు దిగారు. ఫతేబాద్, హిస్సార్, జింద్, సిర్సా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో అన్నదాతలు తొహానా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద టెంట్ వేసుకొని బైటాయించారు. హర్యానాలో అన్ని పోలీస్ స్టేషన్లను సోమవారం కూడాఘోరావ్ చేయాలని రైతు సంఘాలన్ని పిలుపునిచ్చాయి.
జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) చెందిన ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన రైతు నేతలు రవి ఆజాద్, వికాష్ సిర్సాలను విడుదల చేసే వరకు నిరసన ఆపమని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయీ) నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తికాయిత్ మాట్లాడుతూ ''అన్యాయంగా రైతుల్ని అరెస్ట్ చేశారు. తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు స్వయంగా ఎమ్మెల్యేనే ప్రకటించారు. అయినా పోలీసులు రైతుల్ని విడుదల చేయడం లేదు. అయితే వారిని విడుదల చేయండి లేదంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేయండి. రైతుల్ని విడుదల చేసే వరకు నిరసన కొనసాగిస్తాం.'' అని తెలిపారు.
అంతకు ముందు ఎమ్మెల్యే బబ్లీ స్పందిస్తూ ''ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న నాపై కొందరు దాడికి దిగారు. వాళ్లు కచ్చితంగా రైతులు అయితే కాదు. ఆవేశంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమే. దానికి క్షమాపణ చెబుతున్నాను. హింసకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవు'' అని అన్నారు.
అరెస్టు చేసిన రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన కేసును జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ బాబ్లి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించినా రైతులను పోలీసులు ఎందుకు విడిచి పెట్టడం లేదని ఆయన నిలదీశారు. దేవేంద్ర సింగ్ బాబ్లీ తన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పారనీ, అయినా అరెస్టు చేసిన రైతులను విడిచిపెట్టక పోవడంలో పోలీసుల ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ''రైతులను విడుదల చేయండి. లేదంటే మమ్మల్ని కూడా అరెస్టు చేయండి'' అని ఆయన తెగేసి చెప్పారు.
''రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించాలని అధికార యంత్రాంగంతో మేం మాట్లాడినప్పటికీ వారు అంగీకరించలేదు. మళ్లీ మాట్లాడుతున్నాం. మా సోదర రైతులు విడుదలయ్యేంత వరకూ ధర్నా సాగిస్తూనే ఉంటాం. మా కామ్రేడ్లను విడుదల చేయకుంటే మమ్మల్ని కూడా అరెస్టు చేయండి'' అని తికాయిత్ అన్నారు. బహిరంగంగా రైతులను దూషిస్తూ మాట్లాడిన బబ్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. ఈ ధర్నాలో సంయుక్త కిసాన్ మోర్చా నేత గుర్నామ్ సింగ్ ఛాదుని, యోగేంద్ర యాదవ్, యుద్విర్ సింగ్, జోగేందర్ నైన్, సురేష్ కొత్ తదితరులు పాల్గొన్నారు.
192వ రోజుకు చేరిన ఆందోళన..
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతుల ఉద్యమం ఉధఋతంగా సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం ఆదివారం నాటికి 192వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం కొనసాగుతుంది. సింఘూ సరిహద్దు వద్దకు వెయ్యి వాహనాలతో వేలాది మంది రైతులు చేరుకొని, ప్రదర్శన చేపట్టారు.
విజయవంతమైన సంకల్ప్ దివస్
దేశవ్యాప్తంగా సంకల్ప్ దివస్ విజయవంతమైంది. 2017లో మధ్యప్రదేశ్లోని మంద్సూర్ లో రైతుల ఆందోళనలపై జరిపిన పోలీసులు కాల్పులు ఆరుగురు రైతులు మరణించారు. రైతు అమర వీరులను గుర్తు చేసుకుంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన ''సంకల్ప్ప్ దివస్''ను అన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఆన్లైన్ లోనూ, భౌతికంగా ఆందోళనలు జరిగాయి.