Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ సాయంతో భారత్‌కు చేరిన ఆక్సిజన్, ఔషధాలు, బెడ్లు
- ఇప్పుడు ఆకలి సమస్య తీర్చటంపై దృష్టిసారించాలి : సామాజికవేత్తలు
- ఆహార పంపిణీ, రేషన్ సరుకులు కావాలని పెద్ద సంఖ్యలో విన్నపాలు : ఎన్జీఓ సంస్థలు
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్‌తో భారత్ వణికిపోతోంది. ఆక్సిజన్, ఔషధాలు, బెడ్లు..కొరత తీవ్రస్థాయిలో ఉందని అంతర్జాతీయంగా వివిధ దేశాలు సాయం చేశాయి. దేశవిదేశాల్లోని స్వచ్ఛంద సేవా సంస్థలు వందల కోట్ల విలువైన వైద్య సామాగ్రిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అందజేశాయి. అయితే కరోనా రెండో వేవ్‌లో ఇప్పటివరకూ జరిగిన పోరాటం ఒక ఎత్తు, ఇకపై జరిగేది మరో ఎత్తు..అని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో సాయం చేయాలని స్వచ్ఛంద సేవా సంస్థలకు (ఎన్జీవో)లకు విన్నపాలు పెరిగాయని వారు అన్నారు.
ఆక్సిజన్, ఔషధాలు కావాలని మొన్నటివరకూ ఎన్జీవో సంస్థలకు విన్నపాలు వచ్చేవి. ఇప్పుడు ఆహారం కోసం, రేషన్ సరుకుల కోసం విన్నపాలు వస్తున్నాయి. దేశంలో పేదలు, మధ్య తరగతి తీవ్రమైన ఆహార కొరతలో ఉన్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఈనేపథ్యంలో ఆహార సమస్య పరిష్కారం కోసం మోడీ సర్కార్ గట్టి చర్యలు చేపట్టాల్సి వుంటుందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.
90శాతం మందికి ఆహార సమస్య
ఒక అధ్యయనం ప్రకారం మార్చి 2020-అక్టోబరు 2020 మధ్యకాలంలో దారిద్య్రయరేఖకు దిగువకు చేరుకున్న వారిసంఖ్య 23కోట్లు. పేదల సంఖ్యలో పెరుగుదల 77శాతం నమోదైంది. సర్వేలో తమ అభిప్రాయాల్ని వెల్లడించిన కుటుంబాల్లో 90శాతం ఆహార సమస్యలో చిక్కుకున్నారని తేలింది. ఆహారం కోసం ఏదైనా కొందామంటే చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వైరస్ రెండో వేవ్ మరింత పెంచిందని సామాజికవేత్తలు చెబుతున్నారు.
బయటి సాయమే
వైరస్ తాకిడి ఎక్కువగా ఉన్న ఢిల్లీ, బెంగుళూరుకు ఆక్సిజన్ అందిందంటే దానికి కారణం అంతర్జాతీయ సాయమే. దేశంలోని 733 జిల్లాల్లో 533 జిల్లాల్లో వైరస్ పాజిటివిటీరేటు 10శాతం పైన్నే నమోదవుతోంది. సగం జిల్లాల్లో పాజిటివిటీ జాతీయ సగటు 21శాతం కన్నా
ఎక్కువగా ఉంది. కరోనా రెండో వేవ్ మొదటి మూడు వారాల్లో ప్రముఖ ఎన్జీవో సంస్థ దాదాపు 32 మిలియన్ డాలర్ల (రూ.233కోట్లు) విరాళాలు సేకరించింది. వీటితో ఆ ఎన్జీవో సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను, కాన్సన్ట్రేటర్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేసి భారత్‌కు అందించింది. వీటి విలువ సుమారుగా రూ.141కోట్లు ఉందని సమాచారం. అలాగే రెండోవేవ్ను ఎదుర్కోవటంలో భారత్‌కు 38దేశాల నుంచి సాయం అందింది.
ఆక్సిజన్..ఆహారం
ఆక్సిజన్ కొరత నుంచి మనం బయటపడ్డామంటే దానికి కారణం..అన్ని వైపుల నుంచి సాయం అందటమే. అయితే ఇప్పుడు దేశంలోని కోట్లాదిమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పుడు వారికి రేషన్ సరుకులు అందజేయాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. హాస్పిటల్స్ బయట ఉన్నవారికి తిండి దొరకటం లేదు. గ్రామాల్లోనూ ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం ప్రభావం చూపుతోంది.
- అన్షు గుప్తా, 'గూంజ్' ఎన్జీవో వ్యవస్థాపకుడు