Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్న ప్రయివేటు హాస్పిటల్స్
- ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోతున్న కుటుంబాలు
- చికిత్సకోసం ఆస్తులు, బంగారం అమ్ముకుంటున్న బాధితులు
నా పేరు దామోదర్నాథ్. గౌహతిలో మాది వ్యాపారకుటుంబం. మా అన్నయ్యకు, నాకూ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అన్నయ్య ఆక్సిజన్ లెవల్ పడిపోవటంతో..ఆందోళన చెంది, ఇద్దరమూ ఒక చిన్న ప్రయివేటు హాస్పిటల్‌కు వెళ్లాం. రూ.1.7 నుంచి రూ.2లక్షల వరకూ బిల్లు అవుతుందని తొలుత చెప్పారు. షేరింగ్ రూమ్‌లో మేం చికిత్స తీసుకున్నాం. కొంత కోలుకున్నాక, డిశ్చార్జ్ చేసే ముందు రూ.4.5లక్షల బిల్లు మా చేతిలో పెట్టారు. ఇంత కట్టలేం..బిల్లు తగ్గించాలని హాస్పిటల్ యజమానిని వేడుకుందామంటే, ఆయన అందుబాటులోకి రాలేదు. మొత్తం బిల్లు కట్టాకే మమ్మల్ని బయటకు వదిలారు.
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌బారి నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన దామోదర్నాథ్లో ఎలాంటి సంతోషమూ లేదు. కష్టసమయంలో కొంతమంది స్నేహితులు, బంధువులు తలాకొంత సర్దితే డబ్బులు అందాయి. లేదంటే..పరిస్థితి ఏంది? అని అతడి మనసు తీవ్ర వేదనకు గురవుతోంది. ఇప్పుడు కొత్తగా మరోచోట అప్పుచేసి..ఎవరి డబ్బు వారికి ఇచ్చేయాలని దామోదర్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది గౌహతిలోని ఒక్క దామోదర్నాథ్కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు, ప్రయివేటు హాస్పిటల్స్‌లో కరోనా చికిత్స తీసుకున్న దేశంలోని అనేక మంది పరిస్థితి ఇంతే ! ప్రయివేటులో కోవిడ్ చికిత్స కోసం అనేక కుటుంబాలు తమ ఆస్తుల్ని, బంగారాన్ని అమ్ముకుంటున్నారు. పొదుపు చేసుకున్నవాటిని విడిపిస్తున్నారు. ఆస్తి తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వైద్య బిల్లులు చెల్లించడానికి ఆస్తి కాగితాలు తెలిసినవారి దగ్గర తనఖాపెట్టాల్సి వస్తోంది.
రోజుకు రూ.75వేలు వసూలు
హైదరాబాద్‌కు చెందిన ఎన్.విగేష్ యాదవ్ అనుభవం ఇది. ఆయన మాటల్లో...కొద్ది వారాల క్రితం నాన్నకు కరోనా సోకింది. పరిస్థితి సీరియస్‌గా ఉందని ప్రయివేట్ హాస్పిటల్‌కు వెళ్లే..ముందు రూ.2లక్షలు డిపాజిట్ చేయాలన్నారు. రోజుకు రూ.75వేలు ఖర్చు చేయాల్సి వుంటుందని తర్వాత సిబ్బంది చెప్పారు.
చివరికి ఎన్నో ప్రయత్నాలు చేసినా నాన్న మాకు దక్కలేదు. కరోనాతో మరణించారు. ప్రయివేటు హాస్పిటల్స్ కోవిడ్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలే. ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం బిల్లులు వేయటం లేదు.
ఆదేశాలు కాగితాలకే పరిమితం
ప్రయివేటులో కోవిడ్ చికిత్స బిల్లులపై అనేక రాష్ట్రాలు పలు నిబంధనలు విధించాయి. గరిష్టంగా ఇంతకంటే ఎక్కువగా బిల్లులు వసూలు చేయరాదని ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు జీవో జారీచేశాయి. అయితే ఇవేవీ క్షేత్రస్థాయిలో అమలుకావటం లేదని పలు ఎన్జీఓ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు హాస్పిటల్లో కోవిడ్ చికిత్స రోగికి వేసిన బిల్లు రూ.23లక్షలు దాటింది. ఇందులో 'కన్సల్టేషన్ చార్జీలు' రూ.2.45 లక్షలు విధించింది. ఐసీయూలో ప్రతిరోజూకు రూ.35వేలు, జనరల్ వార్డ్‌లో రూ.25వేలు వసూలు చేసింది. ఇంటిని తనఖా పెట్టి రూ.5లక్షలు బాధిత కుటుంబం బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారటంతో.. హాస్పిటల్ వర్గాలు బిల్లులో కొంతమొత్తాన్ని తగ్గిం చారు. తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో ప్రయివేటులో కోవిడ్ చికిత్సపై ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రయివేటు హాస్పిటల్స్ కోవిడ్‌పై ఇష్టారీతిగా బిల్లులు వేస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి.