Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ పెరిగిన చమురు ధరలు
- లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజీల్‌పై 31 పైసలు
- ఇప్పటికే18 సార్లు బాదుడు.. కేంద్రంపై ప్రజల ఆగ్రహం
న్యూఢిల్లీ : ఒక్కరోజు విరామం అనంతరం దేశంలో పెట్రో ధరల మళ్లీ పెరిగి ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. రోజురోజుకూ అదుపులేకుండా పెరుగుతున్న పెట్రో ధరలు వాహనాదారులు, సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలను నియంత్రించకుండా తమపై భారం వేస్తున్నారని మోడీ సర్కారు తీరుపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు కంపెనీల ధరల ప్రకారం.. లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజీల్‌పై 31 పైసలు పెరిగాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు స్తబ్ధుగా ఉన్న చమురు ధరలకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెక్కలొచ్చిన విషయం విదితమే. పెరిగిన ధరలతో దేశంలోని పలు ప్రాంతాల్లో చమురు ధరలు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. సెంచరీకి చేరువై వాహనదారులకు షాకిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.03గా, డీజీల్ ధర రూ. 85.95గా నమోదైంది. ఇక వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.25, డీజీల్ రూ. 93.10 కు చేరుకొని ప్రజలకు షాకిస్తున్నాయి. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.47 , డీజీల్ ధర రూ. 90.66 కు ఎగబాకాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.02, డీజీల్ ధర రూ. 88.80 కు చేరుకొని వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ ధర రూ. 98.76 గా నమోదైంది. లీటర్ డీజీల్‌పై ధర రూ. 93.70 కు ఎగబాకింది. పలు జిల్లాల్లో ఇప్పటికే వందకుపైనే పెట్రోల్ ధర చేరింది.అలాగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీని దాటి పరుగులు పెడుతుండటం గమనార్హం. ఈ విధంగా రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతో నిత్యవసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం చమురు ధరలు 18 సార్లు పెరిగాయి.