Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నేపథ్యంలో పెరుగుతున్న వైనం
- తక్కువ వేతనం..దోపిడీ, హింసకు గురవుతున్న అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ కష్టాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో ప్రజలు పేదరికంలోకి జారుకుంటున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సెకండ్‌వేవ్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌లో ఉపాధి కరువై నిరుద్యోగం పెరుగుతుంటంతో పాటు.. బాండెడ్ లేబర్ క్రమంగా పెరుగుతూ హింస, దోపిడీకి గురవుతున్నారు. వీరు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ.. ఉపశమనం పొందలేని సుడిగుండంలో చిక్కుకున్నారని పలు సర్వేల అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్‌లో దాదాపు 40 కోట్ల మందికి పైగా కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో బాండెడ్ లేబర్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి దేశంలోని ఇటుక బట్టీలు, కర్మాగారాలు సంబంధిత క్షేత్రాలలో పనిచేసే వారి రుణాల పెరుగుదల సాక్ష్యంగా నిలుస్తున్నది. సుదీర్ఘ పని గంటల దోపిడీ పరిస్థితుల్లో చిక్కుకుని తినడానికి తిండి, తాగడానికి నీరు.. మొత్తంగా స్వేచ్ఛలేని బందీలుగా పనిచేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల సరైన వేతనాలు.. చాలా కాలం నుంచి పూర్తి వేతనాలు అందకుండానే పనిచేయాల్సిన దుస్థితిలో చాలా మంది బాండెడ్ లేబర్స్ ఉన్నారని కార్మికరంగ నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో సుమారు 1,35,000 మంది బాండెడ్ లేబర్స్ గుర్తించారు. అయితే, ఎన్జీవో ఆస్ట్రేలియన్ ఛారిటీ వాక్ ఫ్రీ ఫౌండేషన్ తన 2018 'గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్'లో 8 లక్షల మంది బాండెడ్ లేబర్స్ ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ సంఖ్యలు రెట్టింపు స్థాయిలో పెరిగి ఉంటాయి. వీరికి సహాయ చర్యలు అందకపోవడం, పునరావాస కల్పన తక్కువగా ఉండటంతో పాటు కరోనా లాక్డౌన్ కారణంగా బాండెడ్ లేబర్ సంఖ్య గణనీయ పెరుగుదలకు గురైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బాండెడ్ లేబర్‌కు సంబంధించి.. వారి గుర్తింపు, నివారణ, రెస్క్యూ, పునరావాసం, న్యాయ సహాయం వంటి ఐదు కీలక అంశాలకు సంబంధించి దేశంలోని జిల్లా యంత్రాంగాలకు సలహాలు ఇస్తుంది. కేంద్ర, రాష్ట్రాలకు బాండెడ్ లేబర్‌కు సంబంధించి 11 నిర్దిష్ట సిఫారసులు సైతం చేసింది. అయితే, ఇటువంటి సలహాలు, సూచనలు ఉన్నప్పటికీ పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బన్హేరా ఖాస్కు చెందిన దానిష్ అనే ఇటుక బట్టీ కార్మికుడు మాట్లాడుతూ.. ''నేను గతేడాది లాక్డౌన్ కాలం నుంచి పనిచేస్తున్నా. డబ్బులు అడిగినప్పుడు మేం దాడికి గురయ్యాం. ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదు. నలుగురు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాం.. బతుకే భారంగా మారింది'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ''చాలా కాలం నుంచి పనిచేస్తున్నా, మా కదలికలు పరిమితం చేయబడ్డాయి. ఏడాది నుంచి షెట్లర్ ఇచ్చారు కానీ వేతనం ఇవ్వలేదు. ఇల్లు, రేషన్ ఏదీ లేదు. మనుడగ కోసం ఈ పనిలోకి నెట్టబడ్డాం'' అని మరో కార్మికుడు చెప్పాడు. తెలంగాణలోనూ ఇటుకబట్టి కార్మికులపై యజమాని వేధింపులపై కేంద్రమంత్రి జోక్యం చేసుకున్న విషయం విదితమే. కాగా, బాండెడ్ లేబర్స్‌కు పునరావాసం కల్పించడానికి 1978 నుంచి కేంద్ర పథకం అమల్లో ఉన్నది. దీని ప్రకారం వారు 'రిలీజ్ సర్టిఫికెట్' పొందితే వారికి ఈ పథకం ప్రయోజనాలు అందుతాయి. అయితే, క్షేత్ర స్థాయి అమలు దారుణంగా ఉంది. బాండెడ్ లేబర్ నిర్మూలనకు సంబంధించిన జాతీయ ప్రచార కమిటీ (ఎన్సీసీఋబీఎల్)కు చెందిన నిర్మల్ గోరానా మాట్లాడుతూ.. ''కరోనాతో సహాయక చర్యలు పూర్తిగా ఆగిపోయాయి. ఇది అతిపెద్ద సవాలు. న్యాయస్థానాలు కూడా ఈ సమస్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. రిలీజ్ సర్టిఫికెట్స్ సైతం అందుబాటులో లేవు. ముజఫర్‌నగర్‌లో మేము 27 మందిని రక్షించాము. అయితే, లేబర్ కమిషనర్‌తో భారీ గొడవ తర్వాత 15 మందికి మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చారు'' అని తెలిపారు. దీనికి తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు, యూపీ, ఎంపీ వంటి రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థలను పురుద్ధరణ చర్యల పేరిట పరిశ్రమలకు ప్రయోజనం కలిగిస్తూ.. కార్మికులను ఇబ్బందులకు (నష్టం చేకూరే) గురిచేసే చట్టాలను తీసుకురావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి.