Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుల నాయకత్వ వైఫల్యంతోనే సంక్షోభ తీవ్రత
- కొనుగోలు శక్తి పెరగకుండా ఆర్థికంగా కోలుకోలేం : రఘురామ్ రాజన్
- ప్రజాస్వామ్యం బలపడితేనే..దేశానికి మంచిది..
న్యూఢిల్లీ : భారత్లో కరోనా సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కేంద్రంలోని రాజకీయ నాయకత్వ వైఫల్యమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పేదలు, మధ్య తరగతి కొనుగోలు సామర్థ్యం దెబ్బతినడానికి, అప్పుల పాలవ్వడానికి కారణం వైరస్ సంక్షోభమే. అయితే సంక్షోభం ఈ స్థాయిలో విస్తరించకుండా రాజకీయ నాయకత్వం చర్యలు చేపట్టలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే పేదలు, మధ్య తరగతిలో ఆత్మవిశ్వాసం నింపే చర్యలు చేపట్టాలని రాజన్ అన్నారు. రెండో వేవ్ ఇంకా ముగియలేదని, దాని ప్రభావం ముందు ముందు తెలుస్తుందని చెప్పారు. ధనికులు, ఎగువ మధ్య తరగతి వర్గాలపైనా రెండో వేవ్ ప్రభావమున్నట్టు తెలుస్తోందని అన్నారు. ఆంగ్ల న్యూస్ వెబ్ పోర్టల్ 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పై విషయాలు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూలోని కీలక విషయాలు ఈ విధంగా ఉన్నాయి..
వారి కొనుగోలు కీలకం
పేదలు, మధ్య తరగతి కొనుగోలు శక్తి మన ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. ఈ వర్గాల కొనుగోలు శక్తి పెంచకుండా ఆర్థిక వ్యవస్థను ఒడ్డున పడేయలేం. కేంద్రం సీరియస్గా కొన్ని చర్యలు తీసుకోకపోతే పోయిన ఉద్యోగాలు తిరిగి ఏర్పడవు. కరోనా వ్యాప్తిని 'వ్యాక్సిన్' అడ్డుకోగలదని భారత ప్రభుత్వానికి ముందే తెలియదా? తెలుసు. కానీ ఏమీ చేయలేకపోయారు. నాకు తెలిసి..సీరం ఇనిస్టిట్యూట్ (కోవిషీల్డ్) ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ ఆర్డర్ల కోసం ఎదురుచూసింది. దేశీయంగా ఎంత తయారుచేసుకోగలం? విదేశాల నుంచి ఎంత తెప్పించుకోవాలి? ఇదేమీ కేంద్రం ఆలోచించలేదు.
ఉపాధి చూపాలి..
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రతినెలా కొన్ని లక్షల మంది కొత్తవాళ్లు వస్తారు. అయితే అక్కడ ప్రభుత్వరంగంలోగానీ, ప్రయివేటులోగానీ ఉపాధి దొరకటం లేదు. మరి కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించాల్సిన బాధ్యత ఎవరిది? దేశంలోని రాజకీయ నాయకత్వానిదే బాధ్యత. అయితే వారికి ముందుచూపు లేదు. ఒక విజన్ లేదు. బాధాకరమైన విషయం ఏమంటే, ఈ సంక్షోభ సమయాన కూడా రాజకీయ నాయకత్వం తన బాధ్యత నిర్వర్తించటం లేదు. పాలనా అధికారాలు కేంద్రం తన చేతుల్లో పెట్టుకోవటం, నిపుణులను దూరం చేసుకోవటం.. వైఫల్యానికి దారితీసింది. సరైన నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమైంది.
ప్రజాస్వామ్యం దెబ్బతిన్నది..
గతంతో పోల్చితే ప్రజాస్వామ్య దేశంగా భారత్ స్థాయి పడిపోయింది. ప్రపంచ దేశాల్లో మన పరపతి పడిపోయింది. న్యాయ వ్యవస్థపైనా అనుమానాలు వెలువడుతున్నాయి. ప్రజల గోప్యత ప్రమాదంలో పడింది. వర్సిటీల్లో వాక్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీశారు. విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. అయితే ప్రపంచ దేశాల్లో మళ్లీ నిలబడాలంటే అదంతా మారాలి. ప్రజాస్వామ్య లక్షణాలు, గోప్యతా హక్కు బలోపేతం, పటిష్ట న్యాయ వ్యవస్థ ద్వారా అది సాధ్యపడుతుంది.