Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి జమ్ముకాశ్మీర్ నేతల ప్రశ్న
శ్రీనగర్: గత వారం రోజులుగా జమ్ముకాశ్మీర్‌లో పారా మిలటరీ బలగాలను తిరిగి పెద్దయెత్తున మోహరిస్తుండడం.. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి సంబంధించి కొత్త మార్పులు తీసుకురానుందన్న ప్రచారానికి ఆజ్యం పోస్తుంది. దీనిపై స్థానిక రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో బలగాలను ఎందుకు మోహరిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంత ఆకస్మాత్తుగా బలగాలను తరలించడం వెనుక ఆంతర్యమేమిటని నేతలు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కాశ్మీర్ లోయ నుంచి కొత్త డివిజన్లను సృష్టించి, వాటిని చినాబ్ వ్యాలీ, పిర్ పంచల్ జిల్లాలతో విలీనం చేయాలన్న ప్లాన్‌తోనే కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలు చేపడుతోందని వారు పేర్కొంటున్నారు. 2019 జమ్ముకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన సమయంలో చోటుచేసుకున్న అణచివేత సమయంలో అరెస్టు చేసిన పలువురు రాజకీయ నేతలను తిరిగి అరెస్టు చేస్తారన్న ప్రచారం సాగుతోందని, అయినా దేనికైనా సిద్ధంగా ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ నేత తన్వీర్ సాదిక్ అన్నారు. బలగాల మోహరింపుపై సమాధానం ఇవ్వాలని పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సాజిద్ లోణే కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
గత వారం రోజుల్లో జమ్ముకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో 70 కంపెనీల బలగాలను తిరిగి మోహరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2019, ఆగస్టు 5న జమ్ముకాశ్మీర్ స్వయంప్రతిపత్తిని తొలగించిన తర్వాత ఇంత భారీమొత్తంలో బలగాల కదలికలను చూడడం ఇదే తొలిసారి. దీనిపై పోలీసు అధికారులు మాట్లాడుతూ..గత సంవత్సర కాలంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించిన సిబ్బంది మాత్రమే తిరిగి ఇక్కడకు వచ్చి విధుల్లో చేరుతున్నారని అన్నారు. 2020లో 300 కంపెనీల పారామిలటరీ బలగాలను జమ్ముకాశ్మీర్ బయటకు పంపినట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసినందున తిరిగి వస్తున్నారని, ఇది కొత్త మోహరింపు కాదని ఐజిపి విజరుకుమార్ అన్నారు.