Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ముందస్తు పర్యావరణ అనుమతి (ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్) లేకుండా పరిశ్రమలు కార్యక లాపాలు నిర్వహించ లేవని, అవసరాల కోసం ఈ విషయం లో మినహాయింపులు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి) తేల్చిచెప్పింది. ముందస్తు ఇసి అనేది చట్టబద్ధమైన ఆదేశం గనుక, దానికి కట్టుబడి ఉండాల్సిందేని ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ అదర్శ్కుమార్ గోయల్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం స్పష్టం చేసింది. ఫార్మాల్డీహైడ్ తయారీదారులకు ఎటువంటి ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా ఆరు నెలల పాటు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దస్తక్ అనే ఎన్జిఒ సంస్థ ఎన్జిటిలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన బెంచ్ 2006, సెప్టెంబర్ 14న ఇచ్చిన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ముందస్తు ఇసి తప్పనిసరి అని, ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ యూనిట్ల కార్యకలాపాలకు అనుమతిచ్చేందుకు అవకాశం లేదని పేర్కొంది.