Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజీల్‌పై 27 పైసలు పెరుగుదల
- ఎన్నికలయ్యాక.. పెట్రోల్‌పై రూ. 4.91, డీజీల్‌పై 5.49 వడ్డన
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. రోజురోజుకూ ఇంధన ధరలు పెంచుతూ మోడీ సర్కారు దేశ ప్రజల నడ్డివిరుస్తున్నది. తాజాగా, ప్రభుత్వ ఆయిల్ సంస్థలు లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు, డీజీల్‌పై 27 పైసలు పెంచాయి. దీంతో దేశంలోని పలు నగరాల్లో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.31కు చేరుకున్నది. డీజీల్ ధర రూ. 86.22కు ఎగబాకింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ. 101.52కు, డీజీల్ రూ. 93.58కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.71, డీజీల్ ధర రూ. 90.92కు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28కి, డీజీల్ ధర రూ. 89.07కు ఎగబాకింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.49కి చేరగా, డీజీల్ ధర రూ. 91.41గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 28 పైసలు ఎగబాకి ధర రూ. 98.48కి చేరుకున్నది. డీజీల్‌పై 30 పైసలు పెరిగి ధర రూ. 93.38కు ఎగబాకింది.
35 రోజులు.. 20 సార్లు..
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు నిలకడగా ఉన్న పెట్రో ధరలకు.. ఎన్నికలు ముగియగానే రెక్కలొచ్చాయి. గత 35 రోజుల్లో ఇంధన ధరలు 20 సార్లు పెరగడం గమనార్హం. ఈ 35 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ. 4.91, డీజీల్‌పై రూ. 5.49 మేర పెరిగి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దీంతో పెట్రో ధరలను అదుపులోకి తీసుకురావడంలో విఫలమైందంటూ కేంద్రంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.