Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కరోనా కాలంలో బీజేపీకి, మోడీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రకరకాల పద్ధతుల్లో అశాస్త్రీయమైన మూఢ విశ్వాసాలను ప్రచారం చేస్తున్నారు. కొన్ని మచ్చుకు చూద్దాం
కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే :2020 డిసెంబరులో రాబోతున్న రెండో విడత కరోనా వేవ్ ప్రమాదం గురించి అ మంత్రి గారిని అడిగితే '' మొదటి విడత కరోనా వచ్చినప్పుడు నేను 'గో కరోనా! గో ! ' అన్న నినాదం ఇచ్చాను ఆ దెబ్బకి కరోనా పోయింది. ఇప్పుడు గనుక మళ్ళీ వస్తే 'నో కరోనా ! నో !' అని నినాదం ఇవ్వండి కరోనా రాకుండా పారిపోతుంది '' అని శలవిచ్చాడు ! అంటే ఈ ప్రభుత్వం రెండో విడత కరోనా ప్రమాదం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందో తెలిసిపోతుంది.
రాందాస్ అథవాలే లాగే మరో మంత్రివర్గ సహచరుడు అర్జున్ రామ్ మేఘ్వాల్ ''భాభీజీ కా పాపడ్'' తింటే కరోనా రాదని ప్రచారం చేశాడు. ఐతే ఆ ప్రచారం మొదలుబెట్టిన కొద్ది రోజులకే మేఘ్వాల్ గారికే కరోనా వచ్చి ఆస్పత్రిలో చేరవలసివచ్చింది పాపం ! దాంతో ఆ అప్పడం మందు ప్రచారం కాస్తా మూలబడింది.
ఆవు మూత్రం..పేడ
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికైన ప్రగ్యాసింగ్ ఠాకూర్ '' కరోనా రాకుండా వుండాలంటే ఎటువంటి వ్యాక్సినూ అవసరం లేదు దేశీయ ఆవు మూత్రం రోజూ తాగితే ఎటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షనూ రాదు'' అని ప్రచారం చేశారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రంగంలోకి దిగి '' ఆవు పేడ కాని, ఆవు మూత్రం కాని రోగ నిరోధక శక్తిని పెంచుతాయనడానికి ఎటువంటి ఆధారమూ లేదు'' అని ప్రకటించాక ప్రగ్యాసింగ్ ప్రచారం ఆగింది
అయితే ఇతర బిజెపి నాయకులు ఆగలేదు యుపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఆవుపేడ వంటికి రాసుకుని ఆవు మూత్రం తాగే పార్టీలను విరివిగా నిర్వహించాడు '' ఒక గ్లాసు ఆవు మూత్రంలో చల్లని నీళ్ళ కలిపి తాగండి'' అని ఆయనగారు ప్రకటించాడు గుజరాత్ లో ఇది కొందరికి తలకెక్కింది ఇప్పుడు దేశంలోకెల్లా ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు గుజరాత్‌లోనే బైటపడ్డాయి దీని వెనుక ఆవుపేడ రాసుకోవడం, ఆవు మూత్రం తాగడం ఒక కారణం అని పలువురు వైద్యులు అంటున్నారు.
ఇటీవల బెంగాల్ ఎన్నికల సమయంలో సైతం ఆవు మూత్రం ఒక ప్రచారాస్త్రంగా మారింది బిజెపి బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ''నేను ప్రతి రోజూ ఆవు మూత్రం తాగుతున్నాను మీరూ తాగండి '' అని ఎన్నికల సభల్లోనే ప్రచారం చేశాడు. బిజెపి గనుక గెలిస్తే తమకు ఏమివ్వబోతోందో బోధపడిన బెంగాల్ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు.
యజ్ఞాలు చేస్తే ఆ అగ్నిహోత్రం వేడికి కరోనా పోతుంది అని మధ్య ప్రదేశ్ బిజెపి నాయకురాలు ఉషాఠాకూర్ ప్రచారం చేశారు ఆ ప్రచారం తలకెక్కించుకున్న యుపి బిజెపి నేత గోపాల్ శర్మ మీరట్‌లో పశ్చిమ యుపిలో రోడ్లపై సంచార యజ్ఞం నిర్వహించాడు ఆయనే స్వయంగా శంఖంపూరించి మరీ ప్రారంభించాడు ఆ తర్వాతే యుపిలో కరోనా కేసులు విజృంభించాయి మరి !
నిమ్మరసం పీల్చితే చాలట !
కర్నాటక బిజెపి నాయకుడు విజరు శంకేశ్వర్ మరో ప్రచారం చేశాడు ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే ముక్కు ద్వారా నిమ్మరసం పీల్చమన్నాడు ! ఈయనగారికి కొందరు ఆయుష్ విభాగం నుండి కూడా తోడయ్యారు నిమ్మరసం పీల్చమని చెప్పలేదు కాని ముక్కు ద్వారా నువ్వులనూనె కాని, కొబ్బరి నూనె కాని, ఆవు నెయ్యి కాని పీల్చమని వారు శలవిచ్చారు ! ముక్కు ద్వారా పీల్చడం కుదరకపోతే ఓ రెండు చెంచాలు నోట్లో వేసుకుని బాగా పుక్కిలించి ఉమ్మెయ్యమని చెప్పారు మళ్ళీ ఐఎంఎ రంగంలోకి దిగి అటువంటివి పని చెయ్యవని వివరణ ఇవ్వాల్సివచ్చింది.
ఒకే ఒక్కడు !
ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోర్ ఒక్కడు మాత్రం ''మా పార్టీ నేతల ప్రచారం మూర్ఖత్వంలో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది'' అంటూ బాహాటంగానే విమర్శించాడు. అందుకు ఆయనకు బిజెపి పార్టీ సంజాయిషీ చెప్పమని నోటీసు పంపింది.
కరోనిల్‌కు కేంద్ర మంత్రుల ప్రచారం
ఇక రాందేవ్ బాబా కరోనిల్ మందు గురించి స్వయానా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం చేశారు. కరోనిల్ కు అంతర్జాతీయంగా గుర్తింపు ఇచ్చారని వాళ్ళు ప్రకటించారు దాంతో డబ్ల్యు హెచ్‌వో స్వయంగా జోక్యం చేసుకుని కరోనిల్ పని చేస్తుందన్న సర్టిఫికెట్ ఏదీ తాము ఇవ్వలేదని వివరణ ఇచ్చింది ఎవరేం చెప్పినా హర్యానా ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో కరోనిల్ ను ఇంటింటికీ సరఫరా చేస్తోంది.
కేంద్ర నాయకుల దన్ను చూసుకుని విజృంభించిన రాందేవ్ బాబా అల్లోపతి వైద్యం ఎందుకూ పనికిరాదన్న ప్రచారం చేశాడు. దాంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రంగంలోకి దిగి రాందేవ్ బాబామీద పరువునష్టం దావా వేసింది. దాంతో హర్షవర్ధన్ రాందేవ్ బాబా వ్యాఖ్యలను ఖండించాల్సివచ్చింది. ఐనా రాందేవ్ ఇంకా తన వాగుడు మానలేదు దాంతో వైద్యులంతా దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు.