Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా దెబ్బకు వేల కోట్ల నష్టాలు
- రుణాలు చెల్లించలేని స్థితి
- నిధుల కటకట
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు విమానయాన, పర్యాటక రంగానికి కోలుకోని దెబ్బ తగిలింది. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన లాక్డౌన్ నిబంధనలతో విమానయాన రంగం కూనరిల్లింది. వ్యాపారం లేక భారీ నష్టాలతో తీసుకున్న అప్పుల వాయిదాలు చెల్లించలేని స్థితికి చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానయాన సంస్థలు దాదాపు రూ.30వేల కోట్లు నష్టాలను చవి చూడనున్నాయని ఏవియేషన్ కన్సల్టెన్సీ అండ్ రిసెర్చ్ సంస్థ కాపా ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది.
గడిచిన 2020-21లోనూ ఇదే స్థాయి నష్టాలను మూటగట్టుకున్నాయని అంచనా వేసింది. రెండేళ్లలో దాదాపుగా 60వేల కోట్లు నష్టపోవచ్చని పేర్కొంది. కాగా.. ఇందులో ఎయిర్ ఇండియా, ఇండిగో నష్టాలే సగం వరకు ఉంటాయని అంచనా. కాపా రిపోర్ట్ ప్రకారం.. వైరస్ విజృంభణతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 5.25 కోట్లకు విమానయాన ప్రయాణికులు తగ్గారు. 2019-20లో దాదాపు 14 కోట్ల ప్రయాణికులు నమోదయ్యారు. కాగా ప్రస్తుత 2021-22లో ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగు పడితే ప్రయాణికుల సంఖ్య 8-9.5 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఈసారీ ప్రయాణీకుల సంఖ్య భారీగా పడిపోయే అవకాశాలు లేకపోలేదని కాపా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏప్రిల్‌తో పోల్చితే మే నెలలో దేశీయ విమాన ప్రయాణీకులు 57.3 లక్షల నుంచి 19.20 లక్షలకు తగ్గినట్లు వెల్లడించింది. ప్రస్తుత లాక్డౌన్ నిబంధనలు తొలగిపోతే దేశీయ విమానయాన పరిశ్రమలో వ్యూహాత్మక విలీనాలు చోటు చేసుకోవచ్చని కాపా అంచనా వేసింది. వ్యాపారం లేక సతమతమవుతున్న విమానయాన కంపెనీలకు ఇప్పటికే ఉన్న రుణ భారం, సంస్థాగత నిర్వహణ వ్యయం, ముఖ్యంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ క్షీణత, ఎయిర్‌పోర్టు చార్జీలు గుదిబండలా మారాయి. దీంతో ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొత్తగా నిధులను సమకూర్చుకోవడం చాలా కష్టంగా మారింది. రుణ దాతలు ఈ రంగం నుంచి ఇప్పటికే భారీగా మొండి బాకీలను ఎదుర్కోవడంతో తిరిగి అప్పులివ్వడానికి భయపడుతున్నారు.