Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగని కరోనా మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణాలు 3.50 లక్షలకు చేరువయ్యాయి. తాజాగా కొత్త కేసులు లక్షకు దిగిరాగా (1,00,636), 2,427 మరణాలు సంభవించాయి. అలాగే క్రియాశీల కేసుల సంఖ్య 14 లక్షలకు తగ్గాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు కరోనా ఆంక్షలకు సడలింపులు ప్రకటిస్తున్నాయి.
5 రాష్ట్రాల్లో 68.4శాతం కొత్త కేసులు..గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కొత్త కేసుల్లో ఐదు రాష్ట్రాల వాటానే 68.4 శాతంగా ఉంది. తమిళనాడులో అత్యధికంగా 20,421 కేసులు వెలుగుచూడగా, కేరళలో 14,672, మహారాష్ట్రలో 12,557, కర్ణాటకలో 12,209, ఆంధ్రప్రదేశ్లో 8,976 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2.89 కోట్ల మందికి పైగా కరోనా సోకింది. రోజువారీ పాజిటివిటీ రేటు గత 14 రోజులుగా 10 శాతానికి దిగువనే ఉంది.
24 గంటల వ్యవధిలో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.71 కోట్లను దాటాయి. ప్రస్తుతం రికవరీ రేటు 93.94 శాతంగా ఉంది. దేశంలో క్రియాశీల కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం అవి 14 లక్షలకు చేరాయి.
రాష్ట్రాలకు 24.6 కోట్ల డోసుల పంపిణీ
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు 24.6 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసింది. ప్రస్తుతం వాటి వద్ద 1.49 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో 13.9 లక్షల టీకా డోసులు ఇవ్వగా, ఇప్పటివరకు వేసిన టీకాల సంఖ్య 23 కోట్లను దాటింది.
10,12 తరగతి బోర్డు పరీక్షలు రద్దు: పశ్చిమబెంగాల్ సీఎం
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది 10వ తరగతి (మాధ్యమిక్), 12వ తరగతి (ఉచ్ఛ మాధ్యమిక్) బోర్డు పరీక్షలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల రద్దు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
అంతకుముందు, జూలై చివరి వారంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు జులైలోనూ, 10వ తరగతి బోర్డు పరీక్షలు ఆగస్టు రెండో వారంలోనూ జరుపుతామని మమతా బెనర్జీ ప్రకటించారు.
అయితే, కోవిడ్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సోమవారం ప్రకటించారు.
పుదుచ్చేరిలో ప్లస్ టు పరీక్షలు రద్దు
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తమిళనాడును అనుసరిస్తూ కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో కూడా ప్లస్ టూ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. దీంతో, విద్యార్థుల భవిష్యతు దృష్టిలో వుంచుకొని ప్రభుత్వం ఆన్లైన్ తరగతులకు అనుమతించింది. తమిళనాడులో 1 నుంచి ప్లస్ వన్ తరగతుల పరీక్షలు రద్దుచేస్తూ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, ప్లస్ టూ పరీక్షల మార్కులు ఉన్నత విద్యకు ప్రాధాన్యం కావడంతో ఆ పరీక్షలు ఎలాగైనా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పరీక్షలు జరపాలా? వద్దా? అన్న దానిపై ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యానిపుణుల సూచనలు తెలుసుకొని పరీక్షలు రద్దు చేస్తూ శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. తమిళనాడును అనుసరిస్తూ పుదు చ్చేరిలోనూ ప్లస్ టు పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.