Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలని ప్రత్యర్థికి లంచం..
తిరువనంతపురం: కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకునేలా చూసేందుకు ఈయన అతనికి లంచం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. కసర్గఢ్ జిల్లాలోని మంజేశ్వరం నియోజకవర్గం నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కె.సుందర పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్ ఉపసంహరించుకుంటే మొదట 2.5 లక్షలు, స్మార్ట్ ఫోన్, ఆ తరువాత 15 లక్షలు, ఇల్లు, కర్నాటకలో వైన్ షాపు కూడా ఇప్పిస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారని సుందర చెప్పారు. తాను 15 లక్షలు, కర్నాటకలో వైన్ షాపు ఇప్పించాలని కోరాననీ, కానీ నామినేషన్ ఉపసంహరించుకున్న అనంతరం తనకు 2.5 లక్షలు, 15 వేలరూపాయల విలువ చేసే స్మార్ట్ ఫోన్ మాత్రమే ఇచ్చారని సుందర తెలిపారు. కాగా ఎన్నికలు ముగిసిన అనంతరం తననెవరూ పట్టించుకోలేదనీ, దీంతో తాను కేసు పెట్టానన్నారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవంటూ బీజేపీ నేతలు కొట్టి పారేశారు. ఆయనకు తామేమీ లంచం ఇవ్వజూపలేదనీ, పైగా ఎందుకు నామినేషన్ ఉపసంహరించుకున్నదీ ఆయనే స్వయంగా చెప్పాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీకాంత్ అన్నారు. బహుశా సీపీఐ (ఎం) నుంచో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచో వచ్చిన ఒత్తిడి కారణంగా సుందర ఈ ఆరోపణలు చేసినట్టు కనిపిస్తోందన్నారు. ఇదిలావుండగా, ఎన్డీఏలో చేరడానికి జనధిపత్య రాష్ట్రీయ పార్టీ అభ్యర్థి సికె.జానుకు రూ.10లక్షలను కేరళ బీజేపీ చీఫ్ ఇచ్చారని జేఆర్పీ లీడర్ పర్షిత అజీకోడే ఆరోపించగా.. బీజేపీ నేతలు ఖండించారు. అలాగే, కొడకర మనీహీస్ట్ కేసుతో సంబంధముందని బీజేపీపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కేరళ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా ఘోరంగా ఓడిపోయింది.