Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాక్ డ్రిల్‌తో 22మంది మృతి
- 'కార్పొరేట్' దారుణం వెలుగులోకి
లక్నో : ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గల పరాస్ ఆస్పత్రిలో ఆక్సిజన్కొరతతో ఏప్రిల్ 27న 22 మంది కరోనా రోగులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 22మంది తీవ్ర అస్వస్థతకు గురై మరణించారన్న వార్తల్లో మరో కొత్తకోణం వెలుగు చూసింది. ఆక్సిజన్ కొరత ఉందన్న ఆస్పత్రి యజమాని... సరఫరా నిలిచిపోతే ఎలా వుంటుందో ఐదు నిమిషాల మాక్ డ్రిల్ నిర్వహించినట్టు చెప్పిన ఆడియో బయటకొచ్చింది. ఈ వీడియోను ప్రియాంకగాంధీ మంగళవారం తన ట్విటర్లో పోస్టు చేసి ప్రభుత్వాన్ని నిలదీశారు. 'మోడీ పాలనలో ఆక్సిజన్ కొరతతోపాటు, మానవత్వం కూడా కొరవడింది' అని ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.
ఈ ఆడియో క్లిప్పింగ్‌లో డాక్టర్ జైన్ మాట్లాడుతూ.. 'ఆక్సిజన్ కొరత ముఖ్యమంత్రి కూడా తీర్చలేరని నాకు అర్థమైంది. దీంతో నేనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదొక రకమైన మాక్ డ్రిల్. ఆక్సిజన్ సరఫరాలో హెచ్చుతగ్గులు చేయమని సిబ్బందిని కోరాను. అలా చేయడం వల్ల ఎవరు బతుకుతారో... ఎవరు చనిపోతారో తెలుస్తుంది. అందుకే ముందుగా ఓ నిర్ణయానికి వచ్చి.. కోవిడ్ తీవ్రమైన పరిస్థితుల్లో ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ తగ్గించాం. దీంతో ఆ కోవిడ్ రోగులు ఊపిరి పీల్చుకోవడం ఆగి.. శరీరం నీలి రంగులోకి మారిపోయింది. దీంతో 22మంది రోగులు చనిపోతారని అర్థమైంది' అని పరాస్ ఆసుపత్రి యజమాని అరిన్జే జైన్ ఏప్రిల్ 28న మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ బయటపడింది. దీంతో ఈ కార్పొరేట్ ఆసుపత్రి మాక్ డ్రిల్ వ్యవహారం బయటకొచ్చింది. అయితే, ఆగ్రా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ మాత్రం... ఆ రోజున ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదని మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ వీడియో వెలువడిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రా అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఈ వీడియోను కూడా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.