Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు జస్టిస్ చంద్రచూడ్ లేఖ
న్యూఢిల్లీ : ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని హైబ్రీడ్ హియరింగ్స్ కొనసాగాలని సుప్రీం కోర్టు ఇ-కమిటీ ఛైర్పర్సన్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు ఆయన లేఖ రాశారు. దీంతో త్వరలో కోర్టులు భౌతిక విచారణలు ప్రారంభిస్తాయన్న భావనను తోసిపుచ్చినట్లైంది. గతేడాది మార్చిలో కరోనా మహమ్మారి తలెత్తడంతో భౌతిక విచారణల నుండి వీడియా కాన్ఫరెన్సింగ్ విచారణలకు న్యాయ వ్యవస్థ మారిపోయింది. ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 96,74,257కేసులను విచారించినట్లు జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది, న్యాయమూర్తులు, ఇతర పక్షాల భద్రతను దృష్టిలో వుంచుకుని కేవలం భౌతిక విచారణలే నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని జస్టిస్ చంద్రచూడ్ ఆ లేఖలో పేర్కొన్నారు. కొంత కాలం పాటు మనం హైబ్రీడ్ విచారణపై ఆధారపడాల్సి వుందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం వుందన్నారు. దేశవ్యాప్తంగా కోర్టులన్నింటికీ ఏకీకృత వీడియోకాన్ఫరెన్సింగ్ యంత్రాంగం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందని, ఇందుకోసం కమిటీని నియమించామని చెప్పారు.