Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిక్కులేని ఉపాధి హామీ
- యూపీలో వలసకార్మికుల దుస్థితి
- బలవన్మరణాలకు దారి తీస్తున్న కరోనా, లాక్డౌన్, రాజకీయ పరిస్థితులు
లక్నో : యూపీలో వలసకార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్, రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉపాధి కల్పిస్తుందనుకున్న ఉపాధి హామీకి దిక్కు లేకపోవడంతోనూ వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తినడానికి తిండి, చేతిలో నయా పైసా, ఉపాధి లేకపోవడంతో వలసకార్మికులు బలవన్మరణాలకు పాల్పడు తున్నారు. తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. కుటుంబ ఆధారం చనిపోవడంతో అనేక కుటుంబాలు ఒంట రవుతున్నాయి. వలసకార్మికులకు భరోసా కల్పించాల్సిన యోగి ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవడమే మానేసిందని వలసకార్మికులు ఆరోపించారు.
తలకిందులైన తమ జీవన పరిస్థితుల గురించి వివరిస్తూ వలసకార్మికులు వాపోయారు. '' ఢిల్లీలోని ఓ చెప్పుల దుకాణంలో సెక్యూరిటీ ఇంచార్జీగా నేను పని చేసేవాడిని. నాకు నెలకు రూ. 22వేలు జీతం వచ్చేది. అయితే, కరోనా మహమ్మారి నాలాంటి వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. కేవలం మూడు నెలల్లోనే నా జీవితం తలకిందులైంది'' అని బృందావన్ బంజారా(40) వెల్లడించారు. '' చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి కొంత మొత్తాన్ని అప్పు తీసుకున్నాం. పూట గడవడం కోసం, అప్పు తీర్చడానికి మేము తీవ్రంగా కష్టపడుతున్నాం. మాకు అలవాటు లేని పనులను చేయాల్సి వస్తోంది. వచ్చిన మొత్తం వడ్డీలకే వెళ్తున్నది'' అని బంజారా చెప్పారు. రేషన్ దుకాణాల నుంచి అందే సరుకు మాకు ఎటూ అందడం లేదని ఆరోపించారు. ''ఐదు కేజీల గోధుమలు, అంతే మొత్తం బియ్యాన్ని రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్నారు. అంత తక్కువ మొత్తంతో ఎలా బతకాలి? పరిస్థితి ఇలాగే ఉంటే మేము ఆకలికే చనిపోయే పరిస్థితి వస్తుంది'' అని బంజారా ఆందోళన వ్యక్తం చేశారు.
బంజారా లాగే బాధలు అనుభవిస్తున్న వలసకార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బండా జిల్లా నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లే కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, గుజరాత్ వంటి ప్రాంతాలకు వెళ్తారు.
ఇక దేశవ్యాప్తంగా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ పథకం వలసకార్మికుల పాలిట ఒక ఆశా కిరణంగా మారిన విషయం విదితమే. అయితే, యూపీలో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఉపాధి హామీకి ఆటంకం ఏర్పడటంతో వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో యూపీలో పంచాయతీ ఎన్నికల కారణంగా 'ఉపాధి హామీ' పథకం నిలిచిపోయిందని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. అలాగే, పూర్తిస్థాయి లాక్డౌన్ పరిస్థితుల కారణంగానూ కార్మికులు కష్టాలు ఎదుర్కొన్నారని వివరించారు.
అయితే, తాము ఇంత దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ యోగి ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని కార్మికులు ఆరోపించారు. దీంతో తాము బలవన్మరణాలకు పాల్పడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికే పలువురు వలసకార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే మాలాంటి వారు ఇలాగే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. కాగా, సెకండ్‌వేవ్ సమయంలో రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలసకార్మికుల విషయంలో ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే, వీరి సంఖ్య దాదాపు 21 లక్షల వరకు ఉంటుందని అంచనా.