Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రమాదకర కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరులో కేంద్రం విధానం 'సర్జికల్ స్ట్రైక్' లాగా ఉండాలని బాంబే హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన న్యాయస్థానం పై విధంగా స్పందించింది. 75 ఏండ్లు పైబడిన వృద్ధులకు డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాదులు ధ్రుతి కపాడియా, కునాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నగరంలో డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై తాము కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా ముంబయి నగరపాలక సంస్థ న్యాయమూర్తికి వెల్లడించింది. '' మీరు ఈ దేశం మొత్తానికే ఆదర్శమని మేము చెబుతున్నాం. కేరళ ప్రభుత్వం కేంద్రం అనుమతి కోసం వేచి చూసిందా?'' అని కేరళలో జరుగుతున్న డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్‌ను ఉటంకిస్తూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అలాగే, డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ ప్రారంభానికి జరుగుతున్న ఆలస్యంపై కేంద్రాన్ని ప్రశ్నించింది.