Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చనీయాంశంగా ఎన్నికల కమిషనర్ నియామకం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోసంక్షేమ పథకాన్ని దూకుడుగా అమలు చేసిన ఐఎఎస్ అధికారి అనుప్ చంద్ర పాండేను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. మరో తొమ్మిది నెలల్లో యుపిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం యోగి రాజకీయ భవిష్యత్తుతోపాటు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నుంచి తిరిగి పుంజుకోవాలనుకుంటున్న ప్రధాని మోడీకి ఈ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. అనుప్ చంద్ర ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఈయన పర్యవేక్షణలోనే యోగి ప్రభుత్వం 2018లో గోసంక్షేమ పథకాన్ని అమలు చేసింది. 2018, డిసెంబర్లో తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా పట్టణాభివృద్ధికి సంబంధించి విజన్ డాక్యుమెంట్‌పై పనిని మొదలుపెట్టిన ఆయన, సిఎం ఆదిత్యనాధ్ అటువంటి కార్యక్రమం కోరుకోవడం లేదని గ్రహించి దాన్ని నిలిపేశారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అనుప్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించడంతో వచ్చే ఏడాది జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలకు మోడీ ముందస్తుగానే సిద్ధమౌతున్నట్లు తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం, ఇదే సమయంలో ప్రభుత్వం పట్ల రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిజెపికి ఈ ఎన్నికలు కీలకంగా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాలే 2024 లోక్‌సభ ఎన్నికలకు కొలమానంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రిసభ్య ఎన్నికల సంఘంలో సభ్యులుగా ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్రతో పాటు అనుప్ పాండే, రాజీవ్‌కుమార్ ఉన్నారు.