Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్రాసు హైకోర్టులో కర్ణాటక సంగీత విద్వాంసుడు కృష్ణ పిటిషన్
చెన్నై : కేంద్రం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, సమాచార సాంకేతిక చట్టం-2000ని ఉల్లం ఘించేలా ఉన్నాయని పేర్కొంటూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం చెప్పాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిలతో కూడిన బెంచ్ కేంద్రాన్ని కోరింది. నాలుగు వారాల పాటు దీనిపై విచారణను వాయిదా వేసింది. 'నా వరకు సంగీతం మాదిరిగానే ప్రైవసీ (గోప్యత) అనేది కూడా అనుభవమే. నేను గోప్యత గురించి ఆలోచించేటపుడు జీవితం, సన్నిహితత్వం, అన్వేషణ, భద్రత, సంతోషం, భయం లేకపోవడం, సృజించే స్వేచ్ఛ గురించి ఆలోచిస్తా. ఒక కళాకారుడిగా కాకుండా ఒక వ్యక్తిగా నాలో స్వేచ్ఛ, గౌెరవం, ఎంపిక వంటి అంశాలు అంతర్లీనంగా ఇమిడివున్నాయి.'' అని కృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. ''గోప్యత అనేది లేకపోతే కొత్తగా దేన్నయినా సృజించడం, నిర్వహించడం సాధ్యం కాదు. కొత్తగా తీసుకొచ్చిన ఐటి నిబంధనలు ఒక కళాకారుడిగా, సాంస్కృతిక వ్యాఖ్యాతగా నా హక్కులను దెబ్బతీస్తున్నాయి.'' అని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అస్పష్టంగా వున్న ఈ నిబంధనలు కళాకారుల సృజనాత్మకతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.