Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ మృతుల జాబితా సవరణ
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 6,148మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా విలయం ప్రారంభమైనప్పటినుండి ఈ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,59,676కు చేరింది. బీహార్ రాష్ట్రంలో మరణాల సంఖ్యను సవరించడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు భావిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 20,04,690 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 94,052 మందికి వైరస్ నిర్ధారణైంది. రికవరీ రేటు 94.55 శాతానికి చేరింది.
బీహార్‌లో భారీగా మరణాలు
బీహార్‌లో కరోనా మరణాల సంఖ్య ఒక్కసారిగా 72 శాతం పెరిగింది. ప్రతిపక్షాల డిమాండ్‌తో, కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన నితీష్ కుమార్ పభుత్వం ఎట్టకేలకు కరోనా లెక్కల్ని సవరించింది. బుధవారం వరకు అక్కడి ప్రభుత్వం మరణాల సంఖ్యను 5,500గా పేర్కొంది. అయితే, కోర్టు జోక్యం నేపథ్యంలో ఈ సంఖ్యను 9,429గా సవరించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగానే జాతీయ స్థాయిలోనూ మరణాల సంఖ్య పెరిగింది. అయితే ఇదే పరిస్థితి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మరో 8110 మందికి కరోనా
రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా సోకినట్లు తేలింది. 67 మంది చనిపోయారు. మరో 12,981 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరిలో 1,416, చిత్తూరులో 1,042 కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూల్లో 235, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 280 కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో చిత్తూరులో 11 మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది, విశాఖలో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆరుగురేసి, గుంటూరు, కర్నూలులో ఐదుగురేసి, అనంతపురం, కృష్ణాలలో నలుగురేసి, కడపలో ముగ్గురు, నెల్లూరులో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 11,763కు చేరింది.