Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ, యోగి మధ్య పొరపొచ్చాలు
- గవర్నర్‌కు ఇచ్చిన సీల్డ్కవర్లో ఏమున్నది..?
యూపీ బీజేపీలో లుకలుకలు షురూ
అయ్యాయి. యోగి పాలనపై అక్కడి
ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే..
మరోవైపు మోడీ, యోగిల మధ్య
పొరపొచ్చాలు వచ్చాయా..? అందుకే
అడ్డదారిలో గవర్నర్‌తో ఆ రాష్ట్ర బీజేపీ
అధ్యక్షుడు పావులు కదుపుతున్నారా..!
అసలింతకీ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతున్నది..? ఇలాంటి
ఆసక్తికరఅంశాలు పరిశీలిద్దాం.
లక్నో : యూపీ సీఎం కుర్చీ కోసం బీజేపీ నేతలంతా క్యూ కట్టినా.. పార్టీ అదిష్టానం వారిని కాదని గోరఖ్‌పూర్ ఆశ్రమంలో ఉన్న యోగి ఆదిత్యనాధ్‌ను తెచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ఇపుడు మోడీకి యోగి మేకులా తయారయ్యాడనే చర్చనడుస్తున్నది. సుమారు ఏడు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లోపు యూపీ బీజేపీలో రచ్చ షురూ అయింది. దీన్ని కప్పిపుచ్చి, అంతా సెట్‌రైట్ అయిందనేలా చేయటానికి మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా త్రయం కలిసి యోగి మంత్రివర్గాన్ని విస్తరించాలని సూచించింది. అందుకు యోగి నిరాకరించినట్టు సమాచారం. అంతే ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి రాధామోహన్ సింగ్ ఓ సీల్డ్ కవర్ తీసుకుని గవర్నర్ ఆనందిబెన్‌కు అందజేశాడు. అయితే ఆ కవర్లో యోగిని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేల చిట్టా ఉన్నట్టు రాజ్‌భవన్ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. యోగి, పార్టీ హైకమాండ్ల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదని స్పష్టమవుతున్నది.
కాగా, మంత్రివర్గ విస్తరణకు యోగి సర్కార్ ఎందుకు నిరాకరిస్తున్నదో పరిశీలిద్దాం. ఇక్కడ ఇద్దరు బీజేపీ నేతల గురించి ప్రస్తావించాల్సిన అవసరమున్నది. వీరిలో ఒకరు ఏకే శర్మ ఇతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇతను ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు. యోగిపై కన్నేసి ఉంచాలన్నది మోడీ వ్యూహం. అతడ్ని ఉపముఖ్యమంత్రిని చేయాలనీ, లేదా క్యాబినెట్ స్థానం కల్పించాలని సిఫారసు చేశారు.
దీనికి యోగి నో అన్నారని లీకులు వస్తున్నాయి. ఓ జాతీయ వార్తా సంస్థలోనూ దీని గురించి ప్రస్తావిస్తూ.. యోగిని అదుపులో పెట్టడానికే మోడీ ప్రయత్నిస్తు న్నారంటూ ప్రసారం చేసింది. గత నాలుగు నెలల నుంచి మోడీ, యోగిల మధ్య ఎలాంటి భేటీల్లేవ్. కనీసం పలకరింపుల్లేవ్. ఈలోపు ఐఏఎస్ రిటైర్డ్ అధికారిని లక్నోకు పంపటం.. యోగిపై ఒత్తిడి తేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. కానీ యోగి మాత్రం శర్మకు ఎలాంటి పదవీ అప్పగించలేదు. సహాయమంత్రి పదవికి తప్ప ఎలాంటి హౌదా కల్పించటానికి యోగి సర్కార్ సుతరాము ఇష్టంలేదన్నట్టు ఉన్నదని బీబీసీ న్యూస్‌కు సీఎం పేషీ వర్గాలు తెలిపాయి.
నేరుగా మోడీతో ఢకొీనాలన్న తీరులో యోగి వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే.. అక్కడి సీఎంను పిలవటం సర్వసాధారణం. ఢిల్లీ వేదికగా యూపీలో వచ్చే ఎన్నికల గురించి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హౌసబోలే హాజరయ్యారు. కానీ యోగిని మాత్రం దూరంగా ఉంచారు.
మరొకరు కేశవ్ ప్రసాద్ మౌర్య. ఓబీసీ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతనికి పదవి ఇచ్చినా.. యోగి సర్కార్ టార్గెట్ చేస్తూనే ఉన్నది. ఏకే శర్మ, కేశవ్ప్రసాద్ల గురించి తాము చెప్పినా యోగి పట్టించుకోకపోవటంపై బీజేపీ హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నది. ఒకవైపు యోగి మాటవినకపోవటంతో.. కేంద్రమాజీ మంత్రి రాధామోహన్ సింగ్‌ను మోడీ రంగంలోకి దింపి.. నేరుగా గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ వెనుక రాజ్‌భవన్ కీలకపాత్ర పోషించనున్నట్టు సంకేతాలిచ్చింది. గవర్నర్ వెంటనే యోగికి ఫోన్ చేయగానే.. హుటాహుటిన లక్నోకు చేరుకుని, ఒంటరిగా ఓ గదిలో గంటలతరబడి కూర్చున్నట్టు సమాచారం. ఆనందిబెన్ గుజరాతీ కావటం.. మోడీ మొదలుకుని ఢిల్లీలోని బీజేపీ పెద్దలంతా గుజరాతీయులే. వారు ఆదేశానుసారం గవర్నర్ మెలగాల్సి ఉండటంతో యోగికి ముచ్చెమటలు పడుతున్నాయని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి.
2019లో యూపీ అసెంబ్లీలోనే 150 బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. కరోనా సెకండ్‌వేవ్‌లో నాలుగురైదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు చనిపోయారు. వారు చేరిన ఆస్పత్రుల్లో సరైన వైద్యం, మందులు లభించలేదని మీడియా కథనాలు వచ్చాయి. యోగికి వ్యతిరేకంగా అసమ్మతి రగులుతున్నది.
ముదిరిపాకాన పడ్డ బీజేపీ లొల్లి
ఢిల్లీ, లక్నోల మధ్య గ్యాప్ పెరిగింది. మోడీ, యోగిల మధ్య తలెత్తిన లొల్లి ముదిరి పాకాన పడింది. యూపీ బీజేపీలో నెలకొన్న విబేధాలు ఎక్కడ కొంపముంచు తాయోనన్న భయం హైకమాండ్‌ను వెంటాడుతున్నది. యూపీ పొరుగునే ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోనూ పార్టీపై ప్రభావం పడటం ఖాయమన్న వాదన కమలదళంలో వినిపిస్తున్నది. ఈ విషయాన్ని స్థానిక మీడియా కథనాలు హల్‌చల్‌చేస్తున్నాయి. ఇక యోగి వ్యవహరిస్తున్న తీరు క్యాబినెట్లోనూ రచ్చగా మారింది. మంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యపై కక్షసాధింపు చర్యలు అనేకం. వైద్యఆరోగ్యశాఖమంత్రి సిద్ధార్ద్ నాధ్సింగ్ను ఆ శాఖనుంచి తప్పించి మరో శాఖను అప్పగించారు. అయితే యూపీ సీఎం చుట్టూ ఉన్న ఆ ముగ్గురు బ్యూరోక్రాట్లు వెనుకుండి నడిపిస్తున్నారు. వారిలో ఎస్పీ గోయల్, అవనీశ్ అవస్థీ, నవనీత్ సైగల్. మొత్తానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి గందరగోళంలా తయారైంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ ప్రభుత్వ వెబ్సైట్లో ఎక్కడా మోడీ చిత్రం కనిపించటంలేదు. చివరికి నమామి గంగే కార్యక్రమంలోనూ మోడీ ప్రస్తావన కనిపించటంలేదు.
పుట్టినరోజు నో ట్విట్
శత్రువులైన పుట్టిన రోజు అంటే మోడీ ట్వీట్ చేయటం పరిపాటి. కానీ ఆదివారం యోగి పుట్టిన రోజు ఉన్నా.. మోడీ ట్విట్ చేయలేదు. గత నాలుగేండ్లుగా యూపీ సీఎం పుట్టిన రోజున ట్విట్ చేయటం ఆనవాయితీగా మారింది. కానీ ఇపుడు వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నదనటానికి ఇదో ఉదాహరణ. అయితే కరోనా కాలంలో మోడీ ఎవరికి ఇలాంటి ట్విట్లు చేయరని పార్టీ వెనకేసుకొస్తున్నది. కరోనా మొదలైన ఏప్రిల్ నెలలో ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్‌కు పుట్టినరోజున మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా చెప్పారు. యోగికి ఎందుకు మోడీ శుభాకాంక్షలు చెప్పలేదన్న ప్రశ్న తలెత్తుతున్నది.
బీజేపీలో నెంబర్ టు పోట
మోడీ తర్వాత ఎవరు..? అన్న చర్చ బీజేపీలో నడుస్తున్నది. మోడీ నెంబర్ వన్ అయితే.. అమిత్‌షా నెంబర్ టూ గా భావిస్తున్నారు. కాగా, అమిత్‌షా, యోగిల మధ్య టగ్గాఫ్ వార్ కొనసాగుతున్నది. బీజేపీలో అంతర్గత రగడ ఇప్పటిది కాదు. ఆనాడు యూపీ సీఎంగా ఉన్న కల్యాణ్‌సింగ్, వాజ్పారుల మధ్య కూడా అలానే కొనసాగింది. ఆ తర్వాత కల్యాణ్‌సింగ్ పార్టీని వీడకతప్పలేదు. తిరిగి మళ్లీ పార్టీలోకి చేరినా కల్యాణ్ సింగ్ తగిన ప్రాతినిధ్యం దక్కలేదు. ఇపుడు యోగి పరిస్థితి కూడా అలానే మారబోతున్నదన్న సంకేతాలిస్తున్నాయి. వాస్తవానికి కరోనా విజృంభిస్తున్నా..మోడీ కానీ యోగి సర్కార్ కానీ ఎలాంటి కట్టడి చర్యలు తీసుకోలేదు. వేలాదిమంది చనిపోయారు. లక్షలసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రుల్లో మందులు,ఆక్సిజన్లులేక అల్లాడుతుంటే.. యాజమాన్యాలపై యోగి ప్రభుత్వం ఎఫ్ఐఆర్లు పెట్టింది. ఇపుడు యూపీలో ఎన్నికలనగానే మోడీ మొదలుకుని బీజేపీ నేతలంతా భేటీలవుతున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని ఉబలాటపడుతున్నారు. వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా బారాబంకీలో మతరాజకీయానికి తెరలేపారు. అక్కడి ఓ మసీదును కూలగొట్టారు. దీనిపై స్టే ఉన్నా..నేలమట్టం చేశారు. రెండువర్గాల మధ్య రాజకీయ చిచ్చు రేపితే..యూపీలో ఈజీగా గెలవచ్చని బీజేపీ భావిస్తున్నది. ఇంకోవైపు ప్రతిపక్షపార్టీలను ఎలా లాగాలన్నదానిపై తర్జనభర్జనపడుతున్నారు. కానీ కరోనా ప్రళయంలో ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు.
ఢిల్లీలో యోగి
ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడేక్కాయి. యూపీ సీఎం యోగి గురువారం ఢిల్లీలో అడుగుపెట్టారు. కేంద్రహౌంమంత్రి అమిత్‌షాను కలిశారు.శుక్రవారం ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకానున్నారు. మరోవైపు ప్రధాని మోడీతో బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమావేశమై..యూపీ ఎన్నికల గురించి చర్చించారు. ఇప్పటిదాకా మోడీ,యోగిల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదా..? యోగికి వార్నింగ్ ఇస్తుందా..! బుజ్జగించి ఎన్నికలయ్యాక వేటు వేద్దామని అధిష్టానం భావిస్తున్నదా..! ఇపుడు ఇదే లక్నో నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్.