Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుసగా ఏడోసారి...
- 2019-20 లో అధికార పార్టీకి వచ్చిన మొత్తం రూ. 750 కోట్లు
- కాంగ్రెస్‌కు రూ. 139 కోట్లు
న్యూఢిల్లీ : 2019-20 ఏడాదిలో కూడా బీజేపీకి అత్యధిక విరాళాలు అందాయి. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల నుంచి బీజేపీకి ఈ విరాళాలు సమకూరాయి. వీటి ద్వారా ఆ పార్టీకి సుమారు రూ. 750 కోట్ల మేర ఫండ్స్ అందాయి. ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో బీజేపీ ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొన్నది. కాగా, ఇదే కాలంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల కంటే బీజేపీకి వచ్చిన మొత్తం ఐదు రెట్లు అధికం కావడం గమనించాల్సిన అంశం. ఇక గత ఏడు సంవత్సరాలుగా బీజేపీ గరిష్టంగా విరాళాలు అందుకుంటున్నది. 2019-20 ఏడాదికి గానూ.. కాంగ్రెస్‌కు రూ. 139 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రూ. 59 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 8 కోట్లు విరాళంగా వచ్చాయి. 2018-19 నుంచి బీజేపీకి వచ్చిన విరాళాలలో 6శాతం పెరుగుదల ఉన్నది. ఇక కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల మొత్తం రూ. 146.78 కోట్ల నుంచి రూ. 139.01 కోట్లకు పడిపోయింది. ఇక బీజేపీకి అత్యధికంగా విరాళం అందించిన కంపెనీలలో బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కు చెందిన జూపిటర్ క్యాపిటల్, ఐటీసీ గ్రూప్, రియల్ ఎస్టేట్ కంపెనీలు మాక్రోటెక్ డెవలపర్స్, బీ.జీ. షిర్కే కన్స్ట్రక్షన్స్ టెక్నాలజీ, ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, జంకల్యాన్ ఎలక్టోరల్ ట్రస్ట్‌లు ఉన్నాయి. అలాగే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ నాయకులు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.కాగా, ఎన్నికల బాండ్ల విషయంలో బీజేపీ తన వార్షిక ఆడిట్ నివేదికను ఇంకా సమర్పించలేదు. దీంతో ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి సమకూరిన ఆదాయం తెలియదు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ. 2,410 కోట్లు సమకూరాయి. 2018 లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక లబ్ది పొందుతున్నది బీజేపీ యే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.