Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల నేపథ్యంలో కేంద్రం ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న యాంటీ ఫంగల్ డ్రగ్ కేటాయింపులపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం చేస్తున్న కేటాయింపులు తగిన విధంగానూ, సహేతుకంగానూ లేవని తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్రకు అవసరాన్ని బట్టి తగిన సంఖ్యలో కావాల్సిన ఆంఫోటెరిసిన్-బీ వయల్స్‌ను కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు, థర్డ్ వేవ్‌పై తీసుకునే చర్యల గురించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్త, న్యాయమూర్తి జీఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రాన్ని పై విధంగా ఆదేశించింది. మహారాష్ట్ర తరఫున అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి వాదనలు వినిపించారు. బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మికోసిస్)తో రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 82 మంది, ఇప్పటి వరకు 600 మంది చనిపోయారని ధర్మాసనానికి తెలిపినట్టు పీటీఐ పేర్కొన్నది. అయితే, మందు లభించక 82 మంది చనిపోవడంపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో మహారాష్ట్ర నుంచే 25 శాతం(23,254 ) కేసులున్నాయని గుర్తించిన న్యాయస్థానం.. యాక్టివ్ కేసులకు తగినట్టుగా కేంద్రం నుంచి డ్రగ్ కేటాయింపులు లేవని గుర్తించింది. అలాగే, ఎలాంటి బ్లాక్ ఫంగస్ కేసులు లేని లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు 500 వయల్స్ కేటాయించినట్టు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా కోర్టు గుర్తించింది. కాగా, కరోనాపై పోరు, డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కేంద్రాన్ని ఇటీవలే ప్రశ్నించిన బాంబే హైకోర్టు తాజాగా ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.