Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్‌పై 28 నుంచి 30 పైసల చొప్పున పెంపు
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 28 నుంచి 30 పైసల చొప్పున ధరలు శుక్రవారం పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో చమురు ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థలు సవరించిన ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.85, డీజీల్ ధర రూ. 86.75గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.04, డీజీల్ ధర రూ.94.15కు పెరిగింది. గతనెల 29న పెట్రోల్ ధర రూ.100ను దాటిన మెట్రో నగరంగా ముంబయి నిలిచింది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 97.19గా, డీజీల్ ధర రూ. 91.42కు ఎగబాకింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.80, డీజీల్ ధర రూ. 89.60కు పెరిగింది. తెలంగాణలోనూ చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర సెంచరీ మార్కుకు దగ్గరైంది. ఇక్కడ లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు పెరిగి ధర రూ. 99.62గా నమోదైంది. లీటర్ డీజీల్‌పై కూడా 31 పైసలు పెరిగి ధర రూ. 94.57కు ఎగబాకింది.
ఐదు రాష్ట్రాల్లో సెంచరీ దాటిన పెట్రోల్ ధర
దేశంలో పెరుగుతున్న చమురు ధరలు దేశంలోని ఆయా రాష్ట్రాల్లో షాకిస్తున్నాయి. ఇప్పటికి దేశంలోని ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును తాకి పరుగెడుతున్నాయి. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లఢక్‌లు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత గతనెల 4 నుంచి దేశంలో ఇంధన ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. కాగా, శుక్రవారం నాడు పెరిగిన ధరలు 23వది కావడం గమనార్హం.