Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో ఘోరంగా విఫలమైన ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత రావడం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న యుపి సిఎం శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. యోగిపై అసమ్మతి, మంత్రివర్గ పున:వ్యవస్థీకరణతోపాటు ఇతర పలు ఊహాగానాల మధ్య వీరిద్దరి భేటీ దాదాపు గంటకు పైగా సాగింది. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా నివాసానికి వెళ్లిన ఆదిత్యనాథ్ దాదాపు గంటన్నర సమయంపైగా పలు అంశాలపై చర్చించారు. గురువారం ఢిల్లీకి వచ్చిన యోగి ఇప్పటికే హోంమంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వం వైఫల్యం, పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతర్గతంగా ఆయనపై అసమ్మతితో ఉన్న నేపథ్యంలో కీలకమైన యుపి పరిణామాలపై బిజెపి నాయత్వం దృష్టిసారించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిఎంగా యోగిని మార్చే అవకాశం ఉండకపోవచ్చని, మంత్రివర్గంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో పరిణామాలపై గత వారం కేంద్రం నుంచి వచ్చిన బిజెపి సీనియర్ నేత బిఎల్ సంతోష్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలతో పాటు సిఎంతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు.