Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ ఆర్కైవ్స్ భవనంలో మార్పులపై అభ్యంతరం
- కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలి : దేశవిదేశాల్లోని చరిత్రకారులు
న్యూఢిల్లీ : 'సెంట్రల్ విస్టా' ప్రాజెక్ట్‌లో భాగంగా 'జాతీయ ఆర్వైవ్స్ భవనం'లో పలు మార్పులు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అయితే ఆ భవనంలో భారత దేశ చరిత్రకు సంబంధించి కీలకమైన పత్రాలున్నాయని, వీటిని ఏ విధంగా భద్రపరుస్తున్నారు? చరిత్ర పరిశోధనకు ఇది (కేంద్రం చేపడుతున్న మార్పులు) అడ్డంకిగా ఉందని దేశవిదేశాల్లోని వందలాది మంది చరిత్రకారులు, మేధావులు, పరిశోధన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు 'జాతీయ ఆర్కైవ్స్' డైరెక్టర్ జనరల్ చందన్ సిన్హాకు లేఖ రాశారు. జాతీయ ఆర్క్వైవ్స్ భవనాన్ని కూల్చబోవటం లేదని, దానిపక్కనున్న భవనాల్ని మాత్రమే కూల్చేస్తున్నామని, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని నిర్మించి అందులో 'జాతీయ ఆర్కైవ్స్' పత్రాల్ని భద్రపరుస్తామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ఒక ప్రక టన విడుదలచేసింది.
అయితే కేంద్రం చేపడుతున్న ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఆర్కైవ్స్ భద్రపర్చటం కోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో తెలపాలని లేఖలో చరిత్రకారులు చందన్ సిన్హాను కోరారు. కొత్త భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకూ ఆర్కైవ్స్‌ను చూడటానికి పరిశోధన విద్యార్థుల్ని అనుమతిస్తారా? లేదా? అనే సందేహం వ్యక్తం చేశారు. తమ పరిశోధన నిమిత్తం జాతీయ ఆర్వైవ్స్ భవవనంలోకి రావడానికి విద్యార్థులను అనుమతిస్తున్నారా? లేదా అనేదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశం దేశవ్యాప్తంగా విద్యార్థుల పరిశోధనను ప్రభావితం చేస్తుందని, ఆర్కైవ్స్ భవనంలో మార్పులపై పలు అనుమానాలకు తావిస్తోందని, వాటిని నివృతి చేయాలని లేఖలో కోరారు.