Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన బంగారం తనఖా.. పడిపోయిన పొదుపు
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ దెబ్బకు అనేక కుటుంబాల ఆదాయాలు అమాంతం పడిపోయాయి. చాలా కుటుంబాలు అప్పులపై ఆధారపడి నెట్టుకొస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. లాక్డౌన్ నిబంధనలు, కరోనా సంక్షోభంతో అనేక మంది ఉపాధి దెబ్బతినడంతో రోడ్డున పడ్డారు. ఆయా కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా ఆదుకున్నది లేదు. దీంతో పూట గడవడం, కనీస అవసరాల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకోసం ముఖ్యంగా పసిడి తనఖా పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది. సంఘటిత రంగం నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంటున్నట్టు గణంకాలు పేర్కొంటుండగా.. ఇక అసంఘటిత రంగం నుంచి పొందుతున్న అప్పులు అంచనాలకు అందకపోవచ్చని స్పష్టమవుతోంది. ఆర్బీఐ గణంకాల ప్రకారం.. గడిచిన ఏప్రిల్‌లో వ్యక్తిగత రుణాలు 12.6 శాతం పెరిగాయి. బంగారాన్ని తనఖా పెట్టి తీసుకునే రుణాలు ఏకంగా 86శాతం ఎగిశాయి. మరోవైపు మధ్య తరగతి ఎక్కువగా ఉపయోగించే క్రెడిట్ కార్డుల అప్పులు 17 శాతం పెరిగాయి. గడిచిన మార్చిలో పసిడి అభరణాలపై రుణాలు 82 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు చేరాయి. 2020 ఇదే మాసంలో ఈ విభాగం రుణాలు రూ.33,303 కోట్లుగా నమోదయ్యాయి. గడిచిన ఏప్రిల్‌లో ఈ కేటగిరి కింద రూ.62,238 కోట్ల అప్పులు తీసుకున్నారు. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం.. తొలి దశ కరోనా సమయంం 2020-21 జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో కుటుంబాల అప్పులు 37.1 శాతానికి పెరిగాయి. ఇంతక్రితం త్రైమాసికంలో ఇది 35.4శాతంగా ఉంది. రెండో దశ కరోనా ప్రభావం ఎలా ఉందో మరికొన్ని త్రైమాసికాల తర్వాత వెల్లడి కానుంది. జీడీపీలో బ్యాంక్‌లు, గృహ రుణ కంపెనీలు, బ్యాంకింగేతర విత్తసంస్థలు జారీ చేసిన మొత్తం అప్పుల నుంచి కుటుంబాలు పొందిన శాతాన్ని లెక్కిస్తారు. లాక్‌డౌన్‌తో డిమాండ్ దెబ్బతినడం ద్వారా కుటుంబాలతో పాటు సూక్ష్మ పరిశ్రమలు కలిగిన వారు అప్పుల పాలయ్యారు. మరోసారి లాక్డౌన్ పరిస్థితులు వస్తే అనేక కుటుంబాలు, చిన్న సంస్థల పరిస్థితి అత్యంత దుర్బరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్లు అందించడం, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.