Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు కార్యాచరణ
- ఉపాధి కల్పన ధ్యేయంగా విధానాలు : కేరళ సీఎం విజయన్
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్‌తో చిన్నాభిన్నమైన ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. జూన్ 11 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఈ ప్రణాళికను అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. 'ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత సాధించడానికీ, ఆర్థికాభివద్ధిని వేగవంతం చేయడానికీ, ఉపాధి కల్పన ధ్యేయంగా విధానాలకు, పథకాలకు ప్రాధాన్యతనిస్తాం' అన్నారు. ఈ కార్యాచరణ ప్రణాళిలో రూ.2,464.92 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభింస్తామనీ, వివిధ విభాగాల్లో 77 వేల ఉద్యోగాలను సష్టిస్తామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఆరోగ్య మౌలిక సదుపాయలు పెంచుతామని ప్రకటించారు. శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాల అభివృధ్దిపై దృష్టి సారించి.. నాల్జెడ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడమే తమ ముందున్న లక్ష్యమని విజయన్ చెప్పారు.
ముఖ్యంగా పేదరిక నిర్మూలన, ఆర్థిక, సామాజిక అసమానతలను పారద్రోలడం, పర్యావరణ అనకూల అభివృద్ధి దృక్పథాన్ని అమలు చేయడం, పట్టణాల్లో నివసించే వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించేందుకు ఆధునిక ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను అవలంభించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విషతుల్యం కానీ ఆహారాన్ని ఉత్పత్తి చేయడంపై కూడా దష్టి సారిస్తున్నామన్నారు. కేరళ పునర్ నిర్మాణం కోసం అంతర్జాతీయ బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయని తెలిపారు. ప్రపంచ బ్యాంకు, జర్మన్ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల నుంచి రూ.5,898 కోట్ల రుణాలు మంజూరయ్యాయని తెలిపారు.
రెండవ వేవ్‌లో డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువ
కరోనా సెకండ్ వేవ్‌లో రాష్ట్రంపై డెల్టా వేరియంట్ అధిక ప్రభావం చూపిందని విజయన్ అన్నారు. రాష్ట్రంలో భారీ కేసుల నమోదు అదే కారణమన్నారు. ఇప్పుడు ఆ భయాందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయనీ, కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో... రోగుల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. మహమ్మారి వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్డౌన్ ఎంతగానో మేలు చేసిందని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..కేరళలో మరణాల సంఖ్యను తగ్గించగల్గిగామన్నారు. అయితే పరిస్థితులు కొంచెం మెరుగుపడ్డాక.. పూర్తి స్థాయిలో సడలింపులు ఇస్తామని తెలిపారు. ఒక వేళ ఉపద్రవంలా మూడవ వేవ్ ముంచుకొస్తే.. మరణాలు అధికంగా సంభవించే అవకాశాలున్న నేపథ్యంలో సడలింపు చర్యలపై అచితూచీ అడుగులేస్తున్నాన్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా కోవిడ్ నిబంధనలు ప్రజలు పాటించాలని హితవు పలికారు. ఈ సమయంలోనే ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే చర్యలు అనుసరిస్తామని పేర్కొన్నారు. ధర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామనీ, ఆస్పత్రి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 13.9 శాతానికి తగ్గిందనీ, ఈ శాతాన్ని 10కి తగ్గించడమే లక్ష్యమని అన్నారు. కేరళ జనాభాలో 25 శాతం మంది ప్రజలు తొలి మోతాదును తీసుకున్నట్టు చెప్పారు.