Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా ఉన్నాయి
- భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల నిర్బంధం దారుణం : యూఎస్ ఉన్నతాధికారులు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా అనేక అంతర్జాతీయ నివేదికలు, సంస్థలు ఇదే విషయాన్ని అనేకసార్లు ఉద్ఘాటించిన విషయం విదితమే. అమెరికా ఉన్నతస్థాయి అధికారులు సైతం ఇదే వాదనను వినిపిస్తున్నారు. భారత్‌లో మోడీ సర్కారు తీసుకుంటున్న ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలు ప్రజాస్వామిక విలువలకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపారు.
భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛపై మోడీ ప్రభుత్వం విధించిన పరిమితులతో సహా అనేక చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి చట్టసభ సభ్యులకు చెప్పారు. ఆసియా, పసిఫిక్, మధ్య ఆసియా, నాన్ ప్రొలిఫెరేషన్పై హౌస్ ఫారిన్ అఫైర్స్ సబ్‌కమిటీలో ఇండో-పసిఫిక్‌లో ప్రజాస్వామ్యంపై కాంగ్రెషనల్ విచారణ సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియా రాష్ట్ర సహాయ కార్యదర్శి డీన్ థాంప్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. '' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా భారత్ ఉన్నది. ఇది బలమైన న్యాయ నియమం, స్వతంత్ర న్యాయవ్యవస్థతో ఉన్నది. అలాగే, అమెరికాతో బలమైన వూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నది. అయితే, భారత ప్రభుత్వ చర్యలు కొన్ని ఆ దేశ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇవి ఆందోళనకరం'' అని ఆయన అన్నారు.
భావప్రకటనా స్వేచ్ఛపై పెరుగుతున్న ఆంక్షలు, మానవ హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులను నిర్బంధించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయని థాంప్సన్ తెలిపారు. భారత్‌లో పౌరస్వేచ్ఛ క్షీణించిందనీ, పాత్రికేయులపై చర్యలు దారుణంగా ఉన్నాయని ఇప్పటికే పలు నివేదికలు సైతం స్పష్టం చేసిన విషయం విదితమే. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకారులు, రైతన్నలు చేస్తున్న ఆందోళనపై మోడీ సర్కారు వ్యవహరిస్తున్న విధానాన్ని అనేక సందర్భాల్లో పలువురు నిపుణులు ఉదహరించారు. పౌరులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల గొంతు నొక్కుతూ అదేమీ లేదన్నట్టుగా ఎప్పటిలాగే మోడీ ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలు, మానవ హక్కుల సంఘాలు చేసిన విమర్శలను తిరస్కరిస్తూ వస్తున్న విషయం విదితమే.
అలాగే, పెన్సిల్వేనియా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్సీ హాలహాన్ కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. కాశ్మీరి ప్రజలపై అక్కడి ప్రభుత్వ చర్యల గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ''కాశ్మీర్ పరిస్థితులు వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రావాలని మేము కోరాం. ఖైదీల విడుదల, 4జీ యాక్సెస్ పునరుద్ధరణతో పాటు అనేక అంశాలు ఇందులో ఉన్నాయి'' అని థాంప్సన్ చెప్పారు. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్లతో పాలనపై మోడీ సర్కారు పెత్తనం చలాయిస్తుందనీ రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పించిన విషయం విదితమే. అక్కడ, రాజకీయ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి నాయకులతో పాటు సాధారణ పౌరులను సైతం పలు సందర్భాల్లో అకారణంగా నిర్బంధించిన సంఘటనలను సైతం వారు గుర్తు చేశారు. సైన్యాన్ని ఉపయోగించి పౌరులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని వివరించారు.