Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలి
- డీఎస్ఎంఎం డిమాండ్
న్యూఢిల్లీ: మనిరేగాలో కులం పేరుతో చెల్లింపులు చట్ట విరుద్ధమని దళిత శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) పేర్కొంది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు అదనపు ఖర్చు పేరుతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం డీఎస్ఎంఎం ఓ ప్రకటన విడుదల చేసింది. మనిరేగాలో కార్మికులను కులం పేరుతో వర్గీకరించి చెల్లింపులు జరుగుతున్నాయనీ, కులం ఆధారంగా ఈ విభజన, చెల్లింపులు చేయడం కుల వివక్షకు, చెల్లింపులలో అనవసరమైన ఆలస్యానికి దారితీస్తుందని తెలిపింది. కులం ఆధారంగా చెల్లించే ఈ పద్ధతి ఎంఎన్ఆర్ఈజీఏ చట్టం స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. కులం ఆధారంగా చెల్లించిన మొత్తంలో వ్యత్యాసం గురించి కొన్ని ప్రాంతాల నుండి నివేదికలు ఉన్నాయనీ, ఇది సమాన పనికి సమాన వేతనమనే ప్రాథమిక హక్కుకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. ఇది సార్వత్రిక కార్యక్రమమనీ, ఇందులో మతం, లింగం, జాతి ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపకుడదని డీఎస్ఎంఎం స్పష్టం చేసింది.కరోనా పరిస్థితి పర్యవసానంగా కొన్ని ప్రదేశాలలో పని దినాల సంఖ్య 20 రోజులకు తగ్గిపోయిందనీ, ఇది అట్టడుగు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజల జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపింది. రోజుకు కనీస వేతనానికి రూ.600 ఉండగా, మనిరేగా కార్మికులకు మాత్రం రూ.200 కంటే ఎక్కువ ఏమీ లభించడం లేదని పేర్కొంది. ఈ సమయంలో పని దినాల సంఖ్యను పెంచడానికి, చెల్లింపులను పెంచడానికి ప్రయత్నం అవసరం అయితే, దీనికి విరుద్ధంగా కులం పేరుతో విభజనకు పాల్పడటం దారుణమని డీఎస్ఎంఎం పేర్కొంది. ఇది మొత్తం పథకాన్ని నిర్వీర్యం చేయడం తప్ప మరొకటి కాదని విమర్శించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభాలో వాటా ఆధారంగా నిధుల కేటాయింపును తప్పనిసరి చేసిన సబ్ ప్లాన్ను విరమించుకున్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపును తగ్గించడం ఈ కుల వర్గీకరణను స్పష్టం చేసిందని పేర్కొంది.