Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం
- ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఐదు శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అలాగే ఉంటుందని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్-బిపై వేస్తున్న ఐదు శాతం జీఎస్టీని రద్దు చేయాలని నిర్ణయించింది. కరోనాపై పోరులో వినియోగించే ఔషధాలు, వైద్య, ఆక్సిజన్ పరికరాలు సహా పలు ఇతర సామగ్రిపై పన్నులు తగ్గించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆమె అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 12, 18 శాతాల జీఎస్టీ పరిధిలో ఉన్న టెస్టింగ్ కిట్లు, శానిటైజర్లు, రెమ్డెసివర్తో సహా 14 కోవిడ్-19 సంబంధిత ఔషధాలు, పరికరాలపై పన్నును ఐదు శాతానికి తగ్గించారు. అంబులెన్స్‌లపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 12 శాతానికి కుదించారు. ఈ పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయని, తదుపరి పొడిగించే అవకాశం కూడా ఉందని రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు.
75 శాతం టీకాలను కేంద్రమే కొనుగోలు చేయనున్న నేపథ్యంలో 5 శాతం జీఎస్టీని కేంద్రమే భరించనుందని, తద్వారా వచ్చే ఆదాయంలో 70 శాతం వాటాను తిరిగి రాష్ట్రాలకే పంచనున్నామని చెప్పారు. వ్యాక్సిన్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నందున ఇది ప్రజలపై భారం కాబోదని చెప్పుకొచ్చారు.