Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంశాఖ ఉత్తర్వులపై సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ : పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు (హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు) పౌరసత్వం ఇచ్చేందుకు గతనెల 18న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా ఒక పిటిషన్ దాఖలైంది. ఆయా దేశాల నుంచి వచ్చిన ఆయా మతస్తులకు పౌరసత్వం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించాలని గుజరాత్, రాజస్తాన్, చత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలోని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పౌరసత్వ ప్రక్రియను సవాల్ చేస్తూ అనిస్ అహ్మద్ అనే వ్యక్తి తన న్యాయవాది సెల్విన్ రాజా ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే ఈ ప్రక్రియ ముస్లిముల పట్ల పూర్తిగా వివక్షాపూరితంగా ఉందని, వారిని తిరస్కరించే విధంగా ఉందని పేర్కొన్నారు. మే 28న ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగంలోని అధికరణ 14 (సమానత్వపు హక్కు)కు అనుగుణంగా లేదని, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కేంద్రం మతపరంగా కాలరాస్తోందని తెలిపారు. హోంశాఖ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధమైనవిగా పేర్కొనాలని కోర్టును కోరారు. ఈ వివాదంపై ఇప్పటికే ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.