Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 సంబంధిత మరణాలను '' వర్గీకరణ'' చేసే అంశంపై ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు, ఆస్పత్రులు డెత్ ఆడిట్ నిర్వహించాలని ఆయన చెప్పారు. ''ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడని మీరు అనొచ్చు. కానీ, ఆ వ్యక్తి కోవిడ్ పాటిజివ్ కావచ్చు అలాగే ఆ కోవిడ్ గుండెపోటుకూ కారణం కావచ్చు. కాబట్టి, దీనిని మీరు నాన్-కోవిడ్ మరణమైన గుండె సంబంధ సమస్యగా వర్గీకరించొచ్చు'' అని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్యూలో గులేరియా అన్నారు. పాట్నా హైకోర్టు ఆదేశాల అనంతరం మరో 3,951 మరణాలను బీహార్ ప్రభుత్వం వెల్లడించిన విషయం విదితమే. అటు తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 2,213 మరణాలను కరోనా మరణాల కింద చేర్చింది. ఈ నేపథ్యంలో గులేరియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కరోనా మరణాలు, కేసుల సంఖ్య అధికారిక గణాంకాల కంటే చాలా ఎక్కువగానే ఉంటాయని పలు నివేదికలు సూచించాయి. అయితే, మోడీ సర్కారు మాత్రం ఈ వాదనలను ఇప్పటికు ఖండించింది. కాగా, వైరస్ కారణంగా మరణాల సంఖ్యను వాస్తవంగా తెలుసుకోవడం చాలా కీలకమని గులేరియా చెప్పారు. '' మరణాలకు కారణాలు ఏమిటో, మరణ రేటును తగ్గించడానికి ఏమి చేయవచ్చో అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. మనకు స్పష్టమైన సమాచారం లేకపోతే మరణాలను తగ్గించే వ్యూహాన్ని మనం వృద్ధి చేసుకోలేము'' అని గులేరియా అన్నారు.