Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా మరణాల విషయంలో ఉన్న ఫిర్యాదులను మద్రాసు హైకోర్టు గ్రహించింది. కరోనా మరణాలు సరిగ్గా నమోదు కాకపోవచ్చన్న ఫిర్యాదులు దేశవ్యాప్తంగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజిబ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భం గా ఈ వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న కరోనా మరణాలపై స్పష్టమైన సమాచారం భవిష్యత్తులో మహమ్మారితో వ్యవహరించాల్సిన విధానంపై చేపడుతున్న అధ్యయనాలకు తోడ్పాటునందిస్తుందని వివరించింది. మరణాలను కరోనాకు ఆపాదించకపోతే మృతుల కుటుంబాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన పరిహారం పొందలేవని ధర్మాసనం తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు, కేసుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నాయన్న ఆరోపణలు పలుసందర్భాల్లో వినబడుతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడి ప్రతిష్టకు సంబంధించిన అంశం కావడంతో తమ ప్రభుత్వం చులకన కాకూడదనే కారణంతోనే ఈ పరిస్థితి నెలకొని ఉన్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలోనే మద్రాసు హైకోర్టు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.