Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
న్యూఢిల్లీ : నెల రోజుల వ్యవధిలో 23 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కావాలంటే ధరల దరువు తప్పదంటోంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, పెట్రోధరలు పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బంది కలగొచ్చు. అయినా దీనిని భరించక తప్పదు, పెట్రో ధరలు పెంచకుండా సంక్షేమ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఎదురు ప్రశ్నించారు. ఇక్కడి మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టడంపై గత వారం ఆయన చేసిన ప్రకటనకు, ఆదివారం నాటి ప్రకటనకు పొంతనే లేదు. దేశీయంగా పెట్రో ధరలు ఆకాశాన్నంటడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుధరల పెరుగదలే కారణమని గత వారం బుకాయించిన ఆయన ఇప్పుడు సంక్షేమ పథకాల వల్లే పెట్రోధరలు పెంచాల్సి వస్తోందన్నారు. 'ప్రస్తుత ఇంధన ధరలు ప్రజలకు ఇబ్బందికరమేనన్న విషయం తెలుసు. అయినా తగ్గించడం కుదరదు. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వల్ల పద్దెనిమిది రోజుల పాటు పెట్రో ధరలు పెంచలేదు. ఏడాదికి వ్యాక్సిన్ల కోసం 35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎనిమిది మాసాలపాటు ఉచిత బియ్యం కోసం రూ. లక్ష కోట్ల దాకా ఖర్చు చేశాం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద వేల కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమచేశాం. వరి, గోధుమ వంటి వాటికి కనీస మద్దతు ధర పెంచాం . వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటూ పెట్రో ధరలు పెంపును ఆయన సమర్థించుకున్నారు. పెట్రోల్ లీటర్ వంద రూపాయలు దాటడంపై రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై స్పందిస్తూ, అంత ఆందోళన ఉంటే రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలోని తన ముఖ్యమంత్రులను వ్యాట్ తగ్గించుకోమని చెప్పమనండి అని ఉచిత సలహా ఇచ్చారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు రూ.9.48, డీజిల్‌పై రూ.3.36 ఉండేది. ఇప్పుడు పెట్రోలు రిటైల్ అమ్మకపు ధరలో రూ.32.90, డీజిల్ ధరలో రూ.31.80 దాకా ఉంది.