Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో ఆ పార్టీ అధిష్టానం
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కాషాయపార్టీలో కలకలం మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ లుకలుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా నివారణలో విఫలమైన యోగిని దించేస్తే హిందువుల ఓట్లు చీలుతాయేమోన్న ఆందోళనలో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఇటీవల యూపీ నాయకత్వాన్ని మారుస్తారంటూ వచ్చిన వార్తలు సంచలనంగా మారగా, యోగి ఢిల్లీ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమయంలో నాయకత్వ మార్పుతో నష్టం వచ్చే ప్రమాదం ఉందని యోగి మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో యోగి వైఫల్యంపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ భావన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కార్పొరేట్లకు అండగా ఉంటూ, అన్నదాతలకు మోడీ సర్కారు చేస్తున్న అన్యాయాన్ని రైతు ఉద్యమం దిగువ స్థాయి వరకూ తీసుకెళ్లగలిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. సాధారణంగా అధికార పార్టీయే అధిక స్థానాలను గెలుచుకుంటుంది. అందుకు విరుద్ధంగా బీజేపీ మూడోవంతు స్థానాలకే పరిమితమైంది. యోగి తీరుపై మంత్రులు, ఎంపీలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. ప్రధాని మోడీకి యోగిపై మొదటి నుంచి సదభిప్రాయం లేదు. 1998 నుంచి ఐదు సార్లు యోగి ఎంపీగా ఎన్నికైనప్పటికీ.. మోడీ క్యాబినెట్లో ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదు. 2017లో జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న మనోజ్ సిన్హాను యూపీ ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించారు. ఆర్ఎస్ఎస్ మద్దతుతో యోగి ఆ పదవిని దక్కించుకున్నారు. యోగి తీరుపట్ల అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటీవల ప్రధాని సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ ఐఏఎస్ అధికారి ఎకె శర్మను హడావుడిగా ఎమ్మెల్యేను చేయడం, యూపీ మంత్రివర్గంలో ఆయనకు కీలక స్థానం కల్పించడం తనకు చెక్ పెట్టేందుకేనని యోగి భావిస్తున్నారు. మే చివరి వారంలో ఢిల్లీలో మోడీ నేతృత్వంలో యూపీ పరిస్థితులపై ఆర్ఎస్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో అమిత్‌షా, నడ్డా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ మాత్రమే పాల్గొన్నారు. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్‌ను కూడా ఆహ్వానించలేదు. యూపీ గవర్నర్, స్పీకర్లతో ఈ నెల మొదటి వారంలో బీజేపీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రాధామోహన సింగ్ భేటీ కావడం కూడా కలకలం రేపుతోంది.
ఎదురుతిరుగుతారా?
యోగికీ పెద్దగా జనాకర్షణ లేకపోయినా పార్టీలోనూ, హిందూ నేతగానూ గుర్తింపు ఉంది. సీఎం పదవి నుంచి తప్పిస్తే.. కల్యాణ్‌సింగ్, యడియూరప్ప, ఉమాభారతి, కేశూభారు పటేల్‌లాగా ఎదురుతిరగవచ్చని అధిష్టానం భావిస్తోంది. దీంతో హిందూ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాదను పార్టీలోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అప్నాదళ్ నేత అనూప్రియా పటేల్, నిషాద్ పార్టీకి చెందిన సంజరు నిషాద్‌తోనూ అమిత్‌షా చర్చలు జరిపినట్టు సమాచారం. అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట దిగజారుతున్న తరుణంలో ఆయన ప్రచారంతో యూపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదు.