Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-15 రోజుల పాటు ఆందోళనలు : ఐదు వామపక్ష పార్టీల పిలుపు
- 16 నుంచి 30 వరకు నిరసనలు
- ప్రతి వ్యక్తికి పది కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలి
- రూ.7,500 ఖాతాల్లో జమ చేయాలి
- ఆర్థిక సంక్షోభంతో పెరిగిన నిరుద్యోగం.. తగ్గిన కొనుగోలు శక్తి
- మే 2 నుంచి ఇప్పటి వరకు 21 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంపై వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ధరల పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్త పోరుకు పిలుపు నిచ్చాయి. 16 నుంచి 30 వరకు 15 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ పార్టీలు సంయుక్తంగా పిలుపు ఇచ్చాయి. ఈ మేరకు ఆదివారం ఆయా పార్టీల ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), డి.రాజా (సీపీఐ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్), దేబబ్రత బిస్వాస్ (ఫార్వర్డ్ బ్లాక్), మనోజ్ భట్టాచార్య (ఆర్ఎస్పీ) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువులు, మందులపై పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటం వల్ల ప్రజల జీవనోపాధిపై దాడి పెరుగుతున్నదని వామపక్ష పార్టీలు నేతలు పేర్కొన్నారు. 2021 మే 2న శాసన సభల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దాదాపు 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆరోగ్య విపత్తు వినాశనాలను ఎదుర్కోవడానికి ప్రజలకు సాయపడటానికి బదులుగా ధరలను పెంచడం సరి కాదని అన్నారు.
ఈ ధరల పెరుగుదల ప్రభావం హౌల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)పై పడుతున్నదనీ, 11 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి డబ్ల్యూపీఐ చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాపకంతోనే బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన కీల ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ పై మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా అత్యవసర మందులను అక్రమ నిల్వ చేయకుండా నిరోధించాలని కోరారు.
ఆహార వస్తువుల ధరలు ఏప్రిల్లో దాదాపు 5 శాతం, ప్రాథమిక వస్తువుల ధరలు 10.16 శాతం, తయారు చేసిన ఉత్పత్తులు 9.01 శాతం పెరిగాయని పేర్కొన్నారు. ఈ సమయంలో రిటైల్ మార్కెట్లో వినియోగదారుల నుంచి చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉండటంతో నిరుద్యోగం పెరగడం, కొనుగోలు శక్తి పడిపోవడం, పెరుగుతున్న ఆకలి వంటివి స్పష్టంగా కనబడుతున్నాయని అన్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే ఆదాయపు పన్ను చెల్లింపు పరిధిలో లేనటువంటి అన్ని కుటుంబాలకు ఆరు నెలల పాటు నెలకు రూ.7,500 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పీఎంజీకేవై కింద ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాల పంపిణీ దీపావళి వరకు పొడిగిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారనీ, అయితే అందరి పేదవారికి పంపిణీ చేయాలని అన్నారు. ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఏ మాత్రం సరిపోవనీ, నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, వంటనూనె, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, టీ మొదలైన వాటితో కూడిన ఆహార వస్తు సామగ్రితో ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.