Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. రైతు ఉద్యమం ప్రారంభమై (నవంబర్ 26) నేటీ (సోమవారం)తో 200 రోజుల మైలురాయికి చేరనున్నది. అమాయక రైతులపై బీజేపీ సర్కార్ అనేక ఆరోపణలు, నిందలు, తప్పుడు ప్రచారాలు చేశాయి. అయినప్పటికీ రైతులు మొక్కవోని పట్టుదలతో తమపై మోపిన అభాండాలను తిప్పికొడుతూ రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు (తీవ్రమైన చలి, భారీ వర్షాలు)ను సైతం ఎదుర్కొని, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత రైతాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రైతు ఉద్యమంగా కొనసాగుతున్నది. లాఠీ దెబ్బలు, నీటి ఫిరంగులు, బాష్ప వాయు గోళాలను సైతం ఎదురొడ్డి రైతులు నిలబడ్డారు. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకు 505 మంది రైతులు తమ ప్రాణాలను వదిలారు. ఆ అమరవీరుల త్యాగాలను వృధా కానియ్యమని రైతులు పట్టుదలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నిమగమైయ్యారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకు రైతు నేతలపై సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, ఇన్కమ్ టాక్స్ ప్రయోగించిన మోడీ సర్కార్ కు నిరాశే మిగిలింది. దీంతో రైతు నేతలు డీలా పడి పోకుండా, రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడానికి మరిం త పట్టుదలతో పని చేశారు. రైతు ఉద్యమం ఐక్యతను చీల్చేందుకు మోడీ సర్కార్ శతవిధాల ప్రయత్నించింది. అయితే అక్కడా కూడా మొండి చెయ్యే ఎదురైంది. ఉద్యమం చేస్తున్న రైతులకు పోటీగా, ఏనాడు రైతు సమస్యలపై మాట్లాడనీ, అడ్రస్ లేని పోటీ సంఘాలను మోడీ సర్కార్ రంగంలోకి దింపింది. అయితే ఆయా సంఘాల్లో ఎక్కువ శాతం బీజేపీకి అనుకూలంగా ఉన్నవారే ఉండటంతో, అది కాస్తా బెడిసికొట్టింది. ఇలా రైతు ఉద్యమాన్ని అణగదొక్క డానికి తీవ్ర ప్రయత్నం చేసింది. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక.. రైతు ఉద్యమాన్ని చీల్చడం సాధ్యం కాదని భావించిన మోడీ సర్కార్, రైతు నేతలను చర్చలకు ఆహ్వానిం చింది. దాదాపు 11 సార్లు రైతు నేతలకు, ప్రభుత్వానికి చర్చలు జరిగాయి. చిట్టచివరిగా జనవరి 22న చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో పురోగతి లేకపోవడంతో అప్పటి నుంచి చర్చలు జరగలేదు. రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం చట్టాల్లో సవరణలు చేయడానికి మాత్రం అంగీకరిస్తుంది. చట్టాలు రద్దు వెనకడుగు వేస్తుంది. చట్టాల మౌలిక లక్ష్యమే రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నదనీ, అందుకే చట్టాలు రద్దే సమస్యకు పరిష్కారమని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు. రైతు ఆందోళనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు, సరిహద్దులకు భారీగా అన్నదాతల కదులుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ భారీగా రైతులు సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం ఆదివారం నాటికి 199వ రోజుకు చేరింది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్, షాజాహన్ పూర్, పల్వాల్ సరిహద్దుల్లో వేలాది రైతులు ఆందోళనల్లో వందలాది మంది రైతులు భాగస్వామ్యం కొనసాగుతుంది. ఆదివారం పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి వేలాది మంది రైతులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్నారు.