Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూపు కంపెనీల్లో రూ.45వేల కోట్ల లావాదేవీలు
- మూడు విదేశీ కంపెనీల ఖాతాల నిలిపివేత
- డొల్ల సంస్థలపై ఎన్ఎస్డీఎల్ చర్యలు
- కనీసం వెబ్సైట్లు లేని ఎఫ్‌పీఐలు
- మార్కెట్లో కుప్పకూలిన షేర్లు.. అలాంటిదేమీ లేదన్న కంపెనీ
ముంబయి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత అపార కుబేరుడిగా అవతరించిన గౌతం అదానీకి చెందిన కంపెనీల్లో విదేశీ సంస్థలతో హవాలా లావాదేవీలు జరిగాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఖాతాల వివరాలను వెల్లడించలేదని.. దీంతో వాటిని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) స్తంభింపజేసిందని ఎకనామిక్స్ టైమ్స్ ఓ కథనం వెల్లడించడమే ఇందుకు నిదర్శనం. ఖాతాలు ఫ్రీజ్ చేసిన వాటిలో అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఎపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ పండ్లకు సంబంధించిన ఖాతాలున్నాయి. ఈ అనుమానిత విదేశీ సంస్థలు అదానీ గ్రూపునకు చెందిన నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లు కలిగి ఉన్నాయి. మనీ లాండరింగ్ నివారణ చట్టం ప్రకారం.. అదానీ గ్రూపు ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. దీంతో మే 31 లేదా అంతకంటే ముందే వీటిని ఎన్ఎస్డీఎల్ స్తంబింపజేసిందని సమాచారం. ఈ మూడింటి చిరునామాలు కూడా ఒక్కటే కావడం విశేషం. స్టాక్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)లో నమోదైన వివరాల ప్రకారం.. ఒకే అడ్రస్‌తో మారిషస్‌లోని పోర్ట్లూయిస్ కేంద్రంగా పని చేస్తున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు నిర్వహించినప్పటికీ వీటికి కనీసం వెబ్సైట్లు కూడా లేకపోవడం విశేషం. సెబీ, మార్కెట్ నిబంధనల ప్రకారం.. ఎఫ్‌పీఐల వివరాలు ఇవ్వలేకపోతే వారి డీమ్యాట్ ఖాతాలను స్తంబింపజేస్తారు. ఫ్రీజ్ చేసిన ఖాతాల ద్వారా ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలలో దేనినీ విక్రయించలేవు లేదా కొత్త సెక్యూరిటీలను కొనలేవు. తాజా రిపోర్ట్‌తో డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అదానీ గ్రూప్ విషయంలోనూ అదే జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.
డొల్ల వాటాలు ఇలా..
అదానీ గ్రూపులో ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. మారిషస్‌కు చెందిన ఆ మూడు కంపెనీలు అదానీ ఎంటర్ ప్రైజెస్‌లో 6.82 శాతం, అదానీ ట్రాన్మిషన్ 8.03 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 5.92 శాతం, అదానీ గ్రీన్ 3.58 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మరోవైపు గతేడాది అదానీ గ్రూప్ షేర్లు 200 నుంచి 1000శాతం మేర పెరిగాయి. దీనిపై సెబీ దర్యాప్తు కొనసాగిస్తోన్నట్లు తెలుస్తోంది.
భారీ నష్టం..
ఆదానీ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐల ఖాతాలను స్తంభింప చేసిన వార్తలు స్టాక్ మార్కెట్ వర్గాల్లో గుప్పుమన్నాయి. దీంతో కేవలం గంట లోపే గ్రూపు షేర్లన్నీ కనిష్ట స్థాయికి తాకాయి. గత దశాబ్ధ కాలంలో అదానీ షేర్లు అత్యధికంగా పతనం కావడం ఇదే మొదటిసారి. దీంతో ఇంట్రాడేలో గౌతం ఆదానీ నికర సంపద దాదాపు రూ.55వేల కోట్ల (760 కోట్ల డాలర్లు) మేర ఆవిరైపోయింది. తొలి గంటలోనే అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 25 శాతం పతనమై రూ.1,201.10 కనిష్ఠ స్థాయిని తాకింది. ఆదానీ పోర్ట్స్, ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ టోటల్ గ్యాస్, ఆదానీ పవర్, ఆదానీ ట్రాన్స్మిషన్ షేర్లలో అమ్మకాల పరంపర కొనసాగింది. తమ గ్రూపునకు చెందిన మూడు కంపెనీ అకౌంట్లు సీజ్ అయినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అదానీ గ్రూపు పేర్కొంది. ఇది ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే లా ఉందని పేర్కొంది.
ఆ జర్నలిస్టు ముందే చెప్పారు..
దేశంలోని ఓ కంపెనీ ట్రేడింగ్‌లో ఏదో భారీ మోసం జరుగుతుందని ప్రముఖ బిజినెస్ జర్నలిస్టు సుచేతా దలాల్ జూన్ 12న అదానీ గ్రూపు పేరు చెప్పకుండా ట్వీట్ చేశారు. 'ఓ కంపెనీకు చెందిన షేర్ వాల్యూను రిగ్గింగ్ చేస్తూ వస్తోంది. సెబీ ట్రాకింగ్ సిస్టమ్‌లతో లభ్యమయ్యే సమాచారంతోనూ ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించడం కష్టం' అంటూ ఆమె ట్వీట్ చేసింది. అదానీ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడానికి ఆమె ట్వీటే కారణమని నెటిజన్లు సోమవారం ట్రెండింగ్ చేశారు. 1992లో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన హర్షద్ మెహతా స్కామ్‌ను కూడా సుచేతా దలాల్ వెలుగులోకి తెచ్చారు.