Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు పోరాటం వృధా కానివ్వం..
- సాగు చట్టాల్ని రద్దుచేయాల్సిందే..
- ఎంఎస్పీ చట్టపరంగా అమలుజేయాలి..
- రైతుల డిమాండ్లో న్యాయముంది : హన్నన్ మొల్లా
సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పొందటమనే ఏకైక ఎజెండాతో రైతులు ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో ఆరు నెలలకు పైగా రైతులు సాగిస్తున్న ఉద్యమం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మొక్కవోని దీక్షతో దేశంలో రైతులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఓ వైపు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే..ఇటీవల కేంద్రం వరికి ప్రకటించిన ఎంఎస్పీ రూ.1940. ఇది ఏవిధంగానూ న్యాయమైన ధర కాదు. దీని ప్రకారం ప్రతి క్వింటాల్ ధాన్యంపై రైతు రూ.650 నష్టపోతున్నాడు. ఇలాంటి ధరల నిర్ణయంతో రైతులకు న్యాయం జరుగుతుందా? - హన్నన్ మొల్లా, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా కిసాన్ సభ
న్యూఢిల్లీ : గత ఫార్ములా ప్రకారమే ఖరీఫ్ పంటలకు కేంద్రం ఎంఎస్పీ ప్రకటించిందని, ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ నిర్దేశించిన సూత్ర ప్రకారం ధరల నిర్ణయం జరగలేదని ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే, రైతు బతకాలంటే స్వామినాథన్ కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఎంఎస్పీ ఉండాలి. ఇది చట్టపరంగా అమలుజేయాలని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నారని ఆయన చెప్పారు. గత కొద్ది నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని, ఈ పోరాటం వృధా కానివ్వమని ఆయన అన్నారు. రైతుల డిమాండ్లు నెరవేరే వరకూ ఉద్యమం ఆగదన్నారు. పార్లమెంట్ మార్చ్ చేసి తీరుతామని చెప్పారు. తాజాగా ఒక ఆంగ్ల న్యూస్ వెబ్పోర్టల్తో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
స్వామినాథన్ కమిషన్ ఫార్ములా అమలైందా?
ఈ దేశంలో వ్యవసాయం గిట్టుబాటుగాక, ప్రతిరోజూ సగటున 52మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనిని నివారించడానికి స్వామినాథన్ కమిషన్ కీలక సూచన లు చేసింది. అందులో ఎంఎస్పీ ఒకటి. దీనినే అమలు జేయాలని రైతులు కోరుతున్నారు. కొత్తదేమీ అడగటం లేదు. పంట సాగుకు అయిన ఖర్చుకన్నా కొంత ఎక్కువ వచ్చేట్టు ధరల విధానముండాలని కోరుకుంటున్నాం. ఖరీఫ్ లో అత్యధికంగా వచ్చే పంట వరి. దీనికి స్వామినాథన్ ఫార్ములా వర్తింపజేస్తే వరి క్వింటాకు ఎంఎస్పీ రూ.2590 ఇవ్వాలి. కానీ కేంద్రం రూ.1940 ప్రకటించింది. అంటే ప్రతి క్వింటా ధాన్యంపై రైతుకు జరిగే నష్టం రూ.650. ధరల నిర్ణ యం ఇలా ఉంటే రైతుకు న్యాయం జరుగుతుందా? స్వామినాథన్ కమిషన్ ఫార్ములా కేంద్రం పాటించలేదు.
మోడీ సర్కార్ తప్పుడు ప్రచారం
ఎంఎస్పీ అమలుజేస్తున్నామని బీజేపీ నాయకులు, వారి అనుకూల మీడియా పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదంతా ఉత్తదేనని, తాము మోసపోతున్నామని దేశంలోని ప్రతి రైతుకూ తెలుసు. వ్యవసాయానికి, రైతుకు ఎంతో చేస్తున్నామని మోడీ సర్కార్ ప్రజల్లో భ్రమలు కల్పిస్తోంది. ఈ విషయాల్ని బయటపెట్టడానికే రైతులంతా ఢిల్లీ సరిహద్దుకు చేరుకొని ఉద్యమం చేపట్టారు. భారతదేశ చరిత్రలో కనివినీ ఎరుగని ఉద్యమం ఇది. కరోనా సంక్షోభాన్ని అడ్డుపెట్టుకొని, చెడు ప్రచారంతో... ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రకరకాలుగా కుట్రలు జరిగాయి. అవేమీ సాగవు. అంతేకాదు దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో రైతు ఉద్యమం విస్తరించింది. పార్లమెంట్ మార్చ్ చేసి తీరుతాం.